Jan 20,2023 21:31

హిందూపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి, యువజన, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు

         హిందూపురం : విభజన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి తీరని అన్యాయం చేసిందని, దీనిని నిరసిస్తూ భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమం సాగించాల్సిన అవసరం ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.మధు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 'ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో శుక్రవారం ఉదయం విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో బహిరంగసభ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి గురునాథ్‌ సర్కిల్‌ వరకు 'ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు, విభజన చట్టాన్ని అమలు చేయాలని' నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు సాకే నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. హోదా విషయలో బిజెపి, రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు అనుసరిస్తున్న మోసాన్ని ఎండగట్టారు.
బిజెపి పాలనలో రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు సభ్యుడు పి.మధు

ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం తదితర అన్ని విషయాల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని బిజెపి నిలుపుకోకుండా ద్రోహం చేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మౌనంగా ఉన్నారన్నారు. హోదా కోసం విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు బస్సుయాత్ర చేపడితే దీనిని అడ్డుకునేలా జగన్‌ ప్రభుత్వం జీవోలు తేవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి మోడీకి మోకరిల్లుతూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం అని తెలిసినా కేంద్రం అమలు చేస్తున్న నల్ల చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడానికి తహతహ లాడుతున్నారన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును తెలుసుకుని యువజన, విద్యార్థులు రాష్ట్ర భవిష్యత్తు కోసం తలపెట్టిన బస్సుయాత్రకు అనుమతులు ఇవ్వాలని కోరారు. లేదంటే జగన్మోహన్‌రెడ్డి ప్రజాద్రోహిగా చరిత్రలో నిలచిపోతారన్నారు. ప్రతిపక్ష టిడిపి, జనసేన సైతం బిజెపిని ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నాయన్నారు. ఈ పార్టీల్లో మార్పు రాకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వారి అజెండాలను పక్కన బెట్టి ప్రత్యేక హోదా ధర్మయుద్ధంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, తప్పకుండా అనుమతి వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం తాము చేపట్టిన బస్సుయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు.
హోదా ఉద్యమాన్ని అడ్డుకుంటే చిరిత్ర హీనులే..
చలసాని శ్రీనివాస్‌

ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఉద్యమాన్ని జీవోల పేరుతో అడ్డుకునే వారు భవిష్యత్తులో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చలసాని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యంలో ప్రత్యేక హోదా-విభజన హామీలకై చేపట్టిన బస్సుయాత్రకు అనుమతి ఇవ్వకుండా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసిపికి కొమ్ముకాయడం సరికాదన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన బస్సుయాత్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే అన్నారు. దీనికి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన మద్దతు ఇవ్వాలన్నారు. నాడు టిడిపి ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన ధర్మపోరాట దీక్షలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల కోసం శపథం చేశారని, అదే శపథంతో ప్రస్తుత ఉద్యమంలో పాలుపంచుకోవాలన్నారు. పవన్‌ కళ్యాన్‌ బీజేపీ చెర నుంచి బయటకు వచ్చి హోదా కోసం ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల వైపు ఉంటారా.? గుజరాతీ మార్వాడీల వైపు ఉంటారా..? అన్నది తేల్చుకోవాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన యాత్రకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు.
హోదా ఉద్యమం ఆగదు..
విద్యార్థి, యువజన సంఘాలు

ప్రత్యేక హోదా కోసం ప్రస్తుతం చేపట్టిన ఉద్యమం ప్రారంభం మాత్రమే అని, ఇది ఆగదని రాష్ట్ర వ్యాప్తంగా దీనిని కొనసాగిస్తామని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అద్యక్షులు కె.ప్రసన్న కుమార్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ న్యాయస్థానం అనుమతి ఇచ్చిన వెంటనే హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సుయాత్ర చేపడుతాం అన్నారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ యాత్ర ఓట్లు.. నోట్లు... అధికారం కోసం చేస్తున్నది కాదని రాష్ట్రం భవిష్యత్తు కోసం అన్నారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే వెంకన్న సాక్షిగా ఇచ్చిన హోదా హామీని అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో యువజన, విద్యార్థులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు బాబావలి, రాజేంద్ర, చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, హర్షకుమార్‌, చంద్రశేఖర్‌, మూర్తి, పవన,్‌ భగత్‌, అబి,ó మహేష్‌, కార్మిక సంఘం నాయకులు నరసింహులు, వినోద్‌ కుమార్‌, శివప్ప, ఇస్మాయిల్‌, రాజప్ప, శివప్ప, రాముతో పాటు పెద్ద ఎత్తున యువజన, విద్యార్థులు పాల్గొన్నారు.