Feb 19,2023 22:26

ఫొటో : నినాదాలు చేస్తున్న నాయకులు

హమారా ప్రసాద్‌ను శిక్షించాలి
ప్రజాశక్తి-అల్లూరు : దళిత ద్రోహి తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్‌ను మరణ శిక్షతో శిక్షించాలని దళితులు డిమాండ్‌ వ్యక్తపరిచారు. ఆదివారం మండల కేంద్రం స్థానిక బోర్డు స్కూల్‌ వద్ద అంబేద్కర్‌ జ్ఞాన బోధనలపై 3వ సభను ఏర్పాటు చేశారు. ముందుగా దళితులు ర్యాలీగా బయలుదేరి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం ఎదురుగా హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టుకుంటూ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు పొంగులూరు ప్రసాద్‌ మాట్లాడుతూ ఆ రోజుల్లో నేను బతికి ఉంటే గాడ్సే లాగా అంబేద్కర్‌ను కాల్చి చంపుతానని ఆ ద్రోహి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ముసుగులో ప్రపంచ మేధావిపై అవాకులు, చావాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇప్పటికీ దేవాలయాల్లో ప్రవేశాల్లేక దళితులు అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వేల సంవత్సరాలు ఊరికి దూరంగా ఉంచి మతోన్మాదులు పైశాచిక ఆనందాన్ని పొందారని అన్నారు. కార్యక్రమంలో ఎల్లు సాల్మన్‌ రాజు, పొంగులూరి శ్రీనివాసులు, దానం మాల్యాద్రి, కోవూరు శ్రీనివాసులు, బిల్లా మస్తానయ్య తదితరులున్నారు.