Jan 11,2023 22:09

ధర్నాలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : సివిల్‌ సప్లై హమాలీల సమస్యల పరిష్కారం లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని సివిల్‌ సప్లై గోడౌన్‌ వద్ద నుండి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పెంచిన కూలి రేట్ల జీవోను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మూడవ రోజు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్‌ కలెక్టర్‌ కె. కార్తీక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఇఎస్‌ వెంకటేష్‌, సివిల్‌ సప్లై హమాలీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సివిల్‌ సప్లై హమాలీలకు కూలి రేట్ల అగ్రిమెంటు ముగిసి దాదాపు సంవత్సరం గడిచిందన్నారు. కూలి రేట్లు పెంచుతామని చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన ప్రభుత్వం 5 నెలలు అవుతున్న ఇప్పటివరకు జీవోను విడుదల చేయలేదన్నారు. పెరిగిన కూలి రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సివిల్‌ సప్లై హమాలీ యూనియన్‌ నాయకులు ఓబులేసు, శంకర, గంగాధర్‌, హమాలీలు పాల్గొన్నారు.