ప్రజాశక్తి -పెనుకొండ : సివిల్ సప్లై హమాలీల కూలి రేట్లు పెంపుదల జీవోను విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సివిల్ సప్లై స్టాక్ పాయింట్ గోడౌన్ వద్ద మోకాళ్లపై అర్థనగంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ హమాలీలకు కూలి రేట్ల అగ్రిమెంట్ ముగిసి దాదాపుగా సంవత్సరమైందన్నారు. కూలి రేట్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి దాదాపుగా 5 నెలలు అవుతున్నప్పటికీ జీవో విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన కూలి రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని, జనవరి 2022 నుంచి పెరిగిన కూలి రేట్లు అరియర్స్ తో సహా చెల్లించాలని, పిఎఫ్ కు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సివిల్ సప్లై హమాలీ యూనియన్ నాయకులు సలీం, హనుమంతు, రఫిక్, బాబు, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.










