Feb 12,2022 07:14

బిజెపి రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకున్న తాజా చర్య ఇది. విద్యార్థుల డ్రస్‌ మీద ఎలాంటి మతపరమైన చిహ్నాలు వుండడాన్ని అనుమతించబోమనే పేరుతో చదువుకోవాలనుకునే ముస్లిం విద్యార్థినుల హక్కు తిరస్కరించబడుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎల వరుస ప్రకటనలు చూస్తుంటే ముస్లింల మతపరమైన గుర్తింపును లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడుతున్నారన్నది స్పష్టమవుతోంది.

   ముస్లిం యువతులు ధరించే హిజాబ్‌ను సాకుగా చూపి...బిజెపి, హిందూత్వ శక్తులు కర్నాటకలో మరోసారి విచ్ఛిన్నకర, ముస్లిం వ్యతిరేక ధోరణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
    ఉడుపి లోని ప్రభుత్వ పి.యు కాలేజీలో ఆరుగురు బాలికలు తరగతి గదుల్లో హిజాబ్‌ (తలకు చుట్టుకునే స్కార్ఫ్‌) ధరించేందుకు పట్టుబట్టిన వైనాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, హిందూ జాగరణ్‌ వేదికలు బాగా ఉపయోగించుకున్నాయి. కొంతమంది హిందూ విద్యార్థులు కాషాయ తలపాగాలు చుట్టుకుని కాలేజీ గేటు వద్ద నిరసనలు తెలిపేలా రెచ్చగొట్టాయి. ఇదంతా గతేడాది డిసెంబరు 29న జరిగింది. ఆ తర్వాత అదే జిల్లాలోని కుందాపూర్‌లో మరో రెండు కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి రాగా, వారిని కాలేజీల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. కాషాయ తలపాగాలు పెట్టుకుని వస్తామన్న కొందరు ఇతర విద్యార్థుల డిమాండ్‌ను అందుకు కారణంగా పేర్కొన్నారు.
    ఆ వెంటనే కాషాయ స్కార్ఫ్‌లు ధరించిన ఎబివిపి, ఇతర హిందూత్వ సంస్థలకు చెందిన విద్యార్థులు 'జై శ్రీరామ్‌' అంటూ నినాదాలు చేస్తూ...కాలేజీల లోకి వస్తున్న ముస్లిం విద్యార్థినులతో ఘర్షణ పడ్డారు. అంతకు ముందు ఈ కాలేజీల్లో హిజాబ్‌ ధరించి వస్తే అనుమతించేవారు. ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ (పి.యు) కాలేజీల్లో యూనిఫారాలు వున్నందున ముస్లిం విద్యార్థినులు తమ యూనిఫారాల రంగులోనే హిజాబ్‌ ధరించేవారు. కానీ కాషాయ నిరసనలు రేగిన తర్వాత ఇదంతా మారిపోయింది.
    హిజాబ్‌లు ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీ ఆవరణల్లోకి రాకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు ....చదువుకోవాలని ఆశిస్తున్న బాలికలకు జరుగుతున్న ఘోర అన్యాయాన్ని వెల్లడిస్తున్నాయి. హిందూత్వ సంస్థలు సమీకరించిన విద్యార్థులు కాషాయ స్కార్ఫ్‌లు వేసుకుని...హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీల్లోకి రాకుండా అడ్డుకోవడం...వారితో ఘర్షణ పడుతుండడంతో ఈ గొడవలు వివిధ కేంద్రాలకు పాకాయి. ఫలితంగా మూడు రోజులు స్కూళ్ళు, కాలేజీలు మూసివేయాలని కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది.
    ఫిబ్రవరి 5వ తేదీన అన్ని ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్ళకు యూనిఫారాలు నిర్దేశిస్తూ ప్రభుత్వ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు తమ స్వంత యూనిఫారాలు పెట్టుకోవచ్చని పేర్కొంది. ''సమానత్వం, సమగ్రత, శాంతి భద్రతల''ను దెబ్బతీసే దుస్తులను ఎవరూ ధరించరాదని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
    ఆ విధంగా..ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలకు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి రావడాన్ని అనుమతించరాదన్న హిందూత్వ సంస్థల డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం ఆమోదించింది. బిజెపి రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకున్న తాజా చర్య ఇది. విద్యార్థుల డ్రస్‌పై ఎలాంటి మతపరమైన చిహ్నాలు వుండడాన్ని అనుమతించబోమనే వంకతో చదువుకోవాలనుకునే ముస్లిం విద్యార్థినుల హక్కు తిరస్కరించబడుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎల వరుస ప్రకటనలు చూస్తుంటే ముస్లింల మతపరమైన గుర్తింపును లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నారన్నది స్పష్టమవుతోంది. వారిని రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అర్ధమవుతోంది. రాజ్యాంగంలో కల్పించబడిన సమాన హక్కులు వారికి నిరాకరించబడుతున్నాయి. ''మీరు హిజాబ్‌, బురఖా ధరించవచ్చు... కానీ మదరసాలకు వెళ్ళాలి'' అంటూ మైసూరు-కొడగు ప్రాంత ఎం.పి ప్రతాప్‌ సిన్హా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఇది తేటతెల్లమవుతోంది.
     కర్నాటకలో మొత్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హిజాబ్‌ సమస్యనొక్కదాన్నీ విడిగా చూడరాదు. 2019లో కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలపై హిందూత్వ ఎజెండాను రుద్దేందుకు పట్టుబట్టి మరీ ప్రయత్నిస్తోంది. 2020లో అన్ని రకాల పశువులను వధించడానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రధానంగా ముస్లిం మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుంది. ముస్లింలలో చాలామంది పశువుల వ్యాపారంలోనే వుంటారు. మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఆ తర్వాత 'మత స్వేచ్ఛా హక్కు పరిరక్షణకు సంబంధించిన బిల్లు-2021'ను తీసుకువచ్చింది. బలవంతపు మత మార్పిడులపై పోరు పేరుతో క్రైస్తవులను, మతాంతర వివాహాలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లు తీసుకువచ్చారు. దీంతో కోస్తా జిల్లాల్లో వివిధ మతాలకు చెందిన, యువతీయువకులను సామాజికంగా కూడా కలవకుండా కాపు కాసి దాడులు జరపడం ఎక్కువైపోయింది.
    ప్రీయూనివర్శిటీ కాలేజీలకు హిజాబ్‌లు ధరించి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన ఆ విద్యా శాఖే...దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో సూర్య నమస్కారాలు చేయాలంటూ పిలుపు ఇవ్వడం విచారకరం.
    కర్నాటక ప్రభుత్వం ముస్లిం యువతుల ప్రాథమిక విద్యాహక్కుకు వ్యతిరేకంగా వ్యవహరించింది. విద్యాసంస్థల్లో వస్త్రధారణ విషయమై మతపరమైన గుర్తింపు వ్యక్తం కాకూడదన్నట్లైతే...సిక్కు బాలురు టర్బన్లు ధరించి స్కూలుకు వస్తే అనుమతించకూడదనేగా? ముస్లిం బాలిక హిజాబ్‌ ధరించడం, సిక్కు బాలుడు టర్బన్‌ ధరించడం రెండూ సమానమైన, మతపరమైన ఆచారాల కిందకే వస్తాయి.
    హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులకు చదువును దూరం చేస్తున్న ఈ చర్య వెనుక ...ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చేయాలన్న కర్నాటక ప్రభుత్వ ప్రయత్నాలు వున్నాయి. ఒక సెక్షన్‌ పౌరుల రాజ్యాంగ హక్కులకు సంబంధించిన ప్రధానాంశమిది. బాధిత విద్యార్థిని ఒకరు దాఖలు చేసిన కేసును కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. హైకోర్టు విస్తృత ధర్మాసనం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. కర్నాటక ప్రభుత్వం జారీ చేసిన ఈ వివక్షాపూరిత ఉత్తర్వులను...రాజ్యాంగం మైనారిటీలకు కల్పించబడిన హామీల మేరకు కొట్టివేస్తారని ఆశిద్దాం.
 

( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )