మదనపల్లె అర్బన్ : హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, రహదారి భద్రత మన జీవితాలకు రక్షణ అని డిఎస్‌పి కేశప్ప పేర్కొన్నారు. 34వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. బాధ్యత కలిగిన వారుగా వాహనాన్ని నడిపి ప్రమాద రహిత దేశంగా నిలవాలని ఆటోలలో స్కూలు విద్యార్థులు ప్రయాణించటం చాలా ప్రమాదకరమని చెప్పారు. పాఠశాల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మదనపల్లి రవాణాశాఖ అధికారి పి.దినేష్ చంద్ర మాట్లాడుతూ డ్రైవర్లు చేసేటప్పుడు చాలామంది నిర్లక్ష్యంగా సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదం వలన జరుగుతున్నాయన్నారు. డ్రైవింగ్ సమయంలో తమ కుటుంబాలను గుర్తుంచుకోవాలని తెలిపారు. బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చునని సూచించారు. ఉప రవాణాఉప రవాణా శాఖ అధికారి శివలింగయ్య మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం ముందు దేవుడి ఫోటో కన్నా మీ కుటుంబ సభ్యులకు ఫోటో ఉంచుకోవడం శ్రేయస్కరమని సూచించారు. సమావేశంలో ఉప రవాణాశాఖ అధికారి అజరు కుమార్, టూ టౌన్ ఎస్‌ఐ జి.చంద్రమోహన్, నిమ్మనపల్లి ఎస్‌ఐ ఫాతిమా, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.










