Mar 28,2023 22:06

పురాతన శాసనాన్ని చూపుతున్న చరిత్రకారుడు మైనాస్వామి

             మడకశిర : నోలంబ పల్లవ ప్రభువుల రాజధాని హేంజేరు(హేమావతి)లో హోయసల రెండో వీరబల్లాల శాసనంను గుర్తించారు. చరిత్రకారుడు మైనాస్వామి ఆధ్వర్యంలో దీనిని గుర్తించారు. హేమావతి నొలంబ శిల్ప శైలిపై పరిశోధన చేస్తున్న మైనాస్వామి దీనిని గురించి వాటి వివరాలను మంగళవారం నాడు విలేకరులకు తెలియజేశారు. హేమావతి మల్లేశ్వర స్వామి గుడి ప్రవేశ మార్గంలో గండికి అడ్డుగా పెట్టిన శాసన స్తంభాన్ని గుర్తించినట్టు వివరించారు. నోలంబ పల్లవలకు సంబంధించిన ఎన్నో శాసనాలు, చోళులు లకు చెందిన రెండు శాసనాలు హేమావతిలో ఉన్నాయన్నారు. హోయసల రాజులకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి శాసనాన్ని గుర్తించలేదని చెప్పారు. హోయసల రెండో వీరబల్లాల శాసనం మొదటిసారిగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. నోలంబ, హోయసల శాసనాల గురించి బ్రిటిష్‌ వారు ముద్రించిన శాసన సంపుటి 9లో ''హేమావతి - హోయసల'' శాసనం గురించి ఎటువంటి సమాచారం లేదని మైనాస్వామి పేర్కొన్నారు. హేమావతి నోలంబేశ్వర స్వామి గుడికి మాన్యాన్ని దానం చేసినట్టు శాసనం చెబుతున్నదని తెలిపారు. శాలివాహన శకవర్షం 1127 క్రోధన నామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ అమావాస్య ఆదివారం, ఆరోజు సూర్యగ్రహణం నాడు రెండో వీరబల్లాల రాజు మాన్యాన్ని ఇచ్చినట్టు శాసనంలో రాశారని తెలియజేసారు. ఆంగ్ల తేదీ ప్రకారం క్రీస్తుశకం 1206 మార్చి 12న దీనిని ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. నోలంబలను చోళరాజులు జయించిన తరువాత చాళుక్యులకు నోలంబులు సామంతులుగా పనిచేశారని చెప్పుకొచ్చారు. హేమావతిలోని శాసనాలకు ఒక మార్గదర్శి, సూచికను తయారుచేసి ముద్రించి వాటిని సందర్శకులకు అందించాలని భారత పురావస్తు శాఖకు విజ్ఞప్తి చేస్తామన్నారు.