- అధికారుల ప్రతిపాదనపై రైతుల అసంతృప్తి
ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడ-గుండుగొలనం జాతీయ రహదారి-16లో హైటెన్షన్ విద్యుత్ టవర్ లైన్ల ఏర్పాటు నిమిత్తం సేకరించే భూములకు రైతులు సంతృప్తి చెందేలా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్‌టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజరు అన్నారు. విద్యుత్ టవర్ లైన్ల ఏర్పాటులో భూ సేకరణకు సంబంధించి గొల్లపూడి, జక్కంపూడి అంబాపురం, నున్న రైతులతో బుధవారం నగరంలోని కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ రహదారులు, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత రైతులు మాట్లాడుతూ హెచ్‌టి విద్యుత్ టవర్ లైన్ల ఏర్పాటులో స్థానిక అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఎంతో మంది హైటెన్షన్ విద్యుత్ టవర్ లైన్ల వల్ల నష్టపోతారన్నారు. హెచ్‌టి లైన్ల రేడియేషన్ వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని భూగర్భ కేబుల్ లైన్లు ఏర్పాటు చేస్తే తమ భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేని పక్షంలో ఏర్పాటు చేసిన లైన్‌లకు సేకరించే భూమితోపాటు రేడియేషన్ లేకుండా అదనంగా మరి కొన్ని మీటర్ల భూమికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. దీనిపై జెసి స్పందిస్తూ హెచ్‌టి విద్యుత్ టవర్ లైన్ల ఏర్పాటుకు ఇప్పటికే ఎలైన్‌మెంట్ పూర్తిచేసినట్లు చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. భూగర్భంలో కేబుల్స్ లైన్ల ఏర్పాటు సాధ్యపడదన్నారు. ప్రస్తుతం భూ సేకరణకు ప్రతిపాదించిన భూములకు నష్టపరిహారం చెల్లింపులో తగినన్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. మరోసారి తాను కూడా రైతుల సమక్షంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు. అనంతరం రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈసమావేశంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, విజయవాడ రూరల్ తహశీల్దారు బి.శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.










