Feb 06,2023 20:01

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి -రాయచోటి : జిల్లాలోని వివిధ శాఖల హెచ్‌ఒడిలు ప్రతినెలా రెండుసార్లు బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థినుల సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన హాల్లో వసతి గహాల్లో చదివే బాలికల సంరక్షణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 53 ప్రభుత్వ బాలికల వసతి గహాలున్నాయన్నారు. వివిధ శాఖల హెచ్‌ఒడిలు నెలకు రెండు సార్లు వసతి గృహాలను సందర్శించి విద్యార్థినుల సమస్యలు గుర్తించాలన్నారు. దీన్ని ప్రతి అధికారీ విధిగా భావించి సందర్శించాలన్నారు. 10 నుంచి 15 ఏళ్లలోపు వసతి గహాలలోని విద్యార్థినులు తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతుంటారన్నారు. అందువల్ల వారి సమస్యలు పరిష్కరించేందుకు హెచ్‌ఒడిలు వసతి గృహాలను సందర్శించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. అధికారులు వసతి గహాలను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న టీచర్లను బయటకు పంపి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఒకవేళ విద్యార్థినిలు తమ సమస్యలు చెప్పడానికి భయపడితే 'మీ సమస్యలు టీచర్లకు చెప్పమని' వారికి తెలియజేయాలన్నారు. విద్యార్థినిలు నేరుగా తమ సమస్యలు చెప్పలేకపోతే వైట్‌ పేపర్‌ మీద రాయించుకుని అవి తమ దష్టికి తీసుకురావాలన్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థినులు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా బాగా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పాఠశాలలోనూ తప్పక ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని చెప్పారు. బాక్స్‌లలో విద్యార్థినులు తమ సమస్యలు రాసి అందులో వేసేటట్లు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇకనుంచి వసతి గహాలలో చదివే విద్యార్థినుల సంరక్షణ మనందరి బాధ్యతగా భావించాలన్నారు. వారికి ఎటువంటి సమస్యలు తలెత్తిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, మెడికల్‌ ఆఫీసర్‌, సచివాలయ పోలీసులు వసతి గృహాలను సందర్శించే సమయంలో విద్యార్థినులకు లైంగిక విద్య, అనీమియా నివారణ, బాలికల ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు అధికారులు ఉక్కు పాదం మోపాలన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు ఏమీ తెలియదని అలాంటి వారికి బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు తమ దష్టికి వస్తే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.