ప్రజాశక్తి - రాయచోటి : జిల్లాలోని వివిధ శాఖలలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖల హెచ్‌ఒడిల పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే ఎడి జయరాజు, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హెచ్‌ఒడిలు తమ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండడంవల్ల కింది స్థాయి సిబ్బంది మరింత బాగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు.ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్ అయ్యేటట్లు చూడాలన్నారు.అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, బాధితులు సంత ప్తిచెందేలా పరిష్కారం చూపాలన్నారు.స్పందన కార్యక్రమంలో ఎక్కువగా సివిల్ సప్లై, భూసమస్యలు, డిపిఒ, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని వీటిపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.










