May 16,2023 21:30

మాట్లాడుతున్న డాక్టర్లు

మాట్లాడుతున్న డాక్టర్లు
హైపర్‌ టెన్షన్‌తో గుండె సంబంధిత వ్యాధులు
-మెడికవర్‌ వైద్యులు
నెల్లూరు:హైపర్‌ టెన్షన్‌ గుండె జబ్బులకు ప్రధాన కారణంగా ఉందని, హైపర్‌ టెన్షన్‌ గుర్తించి జాగ్రత్తలు పాటిస్తే గుండె జబ్బుల నుండి దూరంగా ఉండవచ్చునని నగరంలోని మెడికవర్‌ హాస్పిటల్‌ సీనియర్‌ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్‌ విజరు అమర్నాధ్‌ రెడ్డి, డాక్టర్‌ మాలేపాటి భాలకష్ణ, డాక్టర్‌ కడియాల రాం ప్రసాద్‌, డాక్టర్‌ జయరాంలు పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ హైపర్‌ టెన్షన్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్‌ హాస్పిటల్‌ లో వైద్యులు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా సీనియర్‌ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్‌ విజరు అమర్నాధ్‌ రెడ్డి, డాక్టర్‌ మాలేపాటి భాలకష్ణ, డాక్టర్‌ కడియాల రాం ప్రసాద్‌, డాక్టర్‌ జయరాం మాట్లాడుతూ భారత దేశంలో అకాల మరణాలకు ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటుగా పిలిచే హైపర్‌ టెన్షన్‌ ఒకటిగా ఉందని తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు రక్తపోటుతో బాధపడుతున్నారని, ఈ రక్తపోటు
కారణంగా గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంభంధ ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రధానంగా హైపర్‌ టెన్షన్‌ వల్ల ఎక్కువ మంది గుండెపోటుకు గురౌతున్నారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో 30 నుండి 40 ఏళ్ల వయసు వారు కూడా హైపర్‌ టెన్షన్‌ మూలంగా గుండెపోటుతో మృతి చెందుతున్నారన్నారు. ఆహార శైలి సరిగా లేకపోవడం, జీవన శైలిలో విపరీత మార్పులు, నిరంతరం ఒత్తిడి, ఊబకాయం, అధిక బరువు, ధూమపానం, మద్యపానం, ఉప్పు అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో హైపర్‌ టెన్షన్‌ కు గురౌతున్నారని వైద్యులు తెలియజేశారు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో హైపర్‌ టెన్షన్‌ ను సులువుగా అదుపుచేసుకోవచ్చునని వెల్లడించారు. ఏడాదికి ఒక సారి గుండె పరీక్షలను తప్పని సరిగా నిర్వహించుకోవాలని సూచించారు. మెడికవర్‌ హాస్పిటల్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ గణేష్‌ మాట్లాడుతూ హైపర్‌ టెన్షన్‌ ను అదుపు చేసేందుకు మెడికవర్‌ హాస్పిటల్‌ లో అవసరమైన అన్నీ వైద్య సదుపాయాలు ఉన్నాయని, అనుభవజ్ఞులైన వైద్యులు కూడా ఉన్నారన్నారు. తక్కువ ఫీజుతోనే గుండె సంభందిత పరీక్షలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మెడికవర్‌ వైద్య సేవలను, తక్కువ ఫీజుతో అందిస్తున్న వైద్య పరీక్షలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ మహేశ్వర్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.