కలెక్టర్‌కు బాధిత గ్రామ ప్రజల వేడుకోలు
ప్రజాశక్తి-రాయచోటి: వీరబల్లి మండలం మాండవ్య నది పరీవాహక ప్రాంతమైన కల్లేవాళ్ళపల్లి వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు పెట్టవద్దంటూ కళ్ళేవాళ్ళపల్లె, గడికోట, దిగురాచపల్లె, వంగిమల్ల ప్రజలు సోమవారం కలెక్టర్ గిరీషకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ వీరబల్లి మండలంలోని దిగువరాచపల్లి గ్రామంలోని కల్లేవాళ్ళపల్లె వద్ద మాండవ్య నదిలో 1.17 టిఎంసిల నీటితో లోయర్ రిజర్వాయర్ నిర్మించి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనివలన మాండవ్య నది పరీవాహక ప్రాంతమైన రాయచోటి నుండి గడిగోట వరకు 30 కిలోమీటర్ల పొడవునా వ్యవసాయ భూములకు నీటి కొరతతోమ పాటు తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆదోళన వ్యక్తం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టును మాండవ్య నదిలో కళ్ళేవాళ్ళపల్లె వద్ద ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తరతరాలుగా ఈ సారవంతమైన భూములపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. వందలాది ఎకరాలు ప్రాజెక్టు కోసం సేకరించడానికి ప్రభుత్వం సిద్ధపడు పడుతున్నదని పేర్కొన్నారు. తమ భూములు వారికి అప్పజెపితే తాము జీవనభృతి కోల్పోయి రోడ్డుపై పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం కొండపై కూడా మరొక రిజర్వాయర్ నిర్మించి కింది రిజర్వాయర్ నుంచి కొండపై ఉన్న రిజర్వాయర్వుకు నీటిని సైక్లింగ్ చేసినప్పుడు 20 శాతానికి పైగా నీరు వృథా అవుతుందని, ఆ నీటిని మళ్ళీ మాండవ్య నది నుంచి సేకరించవలసి వస్తుందని దీనివలన మాండవ్య నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వ్యవసాయ బోర్లు తాగునీటి బోర్లు ఎండిపోయే అవకాశం ఉందని తెలిపారు. గొర్రెలు, మేకలు, ఇతర పశువులకు తాగే నీరు కూడా అందుబాటులో లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాండవ్య నది గత 20 సంవత్సరాలలో మూడు, నాలుగు సంవత్సరాలు మాత్రమే నీరు పారిందని మిగతా సంవత్సరాలలో ఎండిపోయి ఉందన్నారు. ప్రతి సంవత్సరం తగినంత నీరు లభ్యం కాని మాండవ్య నదిలో నిత్యం నీటితో అవసరమయ్యే హైడ్రో ప్రాజెక్టును పెట్టడం సరైనది కాదన్నారు. గ్రామాల్లో ఉన్న భూములను హైడ్రో పవర్ ప్రాజెక్టుకు తీసుకోవడం వలన రైతులే కాకుండా రైతు కూలీలు, ఉపాధి కూలీలు కూడా శాశ్వతంగా ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు తలెత్తి ప్రాజెక్టు చుట్టూ పది కిలోమీటర్లు ఉన్న గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు తెలిపారు. వీరికి మద్దతుగా ఒపిడిఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి న్యాయవాది ఈశ్వర్, టిడిపి మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రాజు, ఎపి వడ్డెర విద్యావంతుల వేదిక నాయకులు మారుతి, శంకర,్ చల్లారెడ్డయ్య, శ్రీనివాసులు, వెంకటేష్ పాల్గొన్నారు.










