హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోకి గత నెలలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఇవాళ జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ప్రాంతాలతో సహా సికింద్రాబాద్ భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వరద నీరు ఏరులై పారడంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన జిహెచ్‌ఎంసి అధికారులు సహాయక చర్యలను చేపట్టారు.
రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు..
తెలంగాణపై 2.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయి. ఈ క్రమంలో రాగాల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో అత్యధికంగా వెల్దండ (నాగర్ కర్నూల్ జిల్లా)లో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం, వెలిజాల (రంగారెడ్డి)లో 3.8 సెంటిమీటర్లు, చలకుర్తి (నల్గొండ)లో 3.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.










