Jan 05,2023 17:39

మదనపల్లె : భిక్షాటన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను విడుదల చేయాలనీ, హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కార్తీక్‌, నరసింహలు మాట్లాడుతూ కరువుకు నిలయమైన రాయలసీమ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు సంబంధించిన వేలాది మంది విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ వసతి గృహాలు అభివృద్ధి చేస్తామని చెబుతూ మరొకవైపు సంక్షేమ హాస్టల్స్‌ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. 2018లో గత ప్రభుత్వం అందిస్తున్న మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు నేటికీ కొనసాగించడం సబబు కాదన్నారు. కొన్ని హాస్టళ్లలో కనీసం తాగడానికి మంచినీరు, టాయిలెట్‌, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని, విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి బెడ్‌షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు, వెంటనే పంపిణీ చేయాలని, విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి అన్ని వసతులు కల్పించాలని, సంక్షేమ హాస్టల్లలో నాడు-నేడు పనులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు కనుకూలంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని, లేనిపక్షంలో విద్యార్థుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.గణేష్‌, మదనపల్లి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జయ బాబు, నాని పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌: పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్‌ చేశారు. గురువారం పాత బస్టాండ్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నారాయణ, అఖిల్‌, సుభాన్‌, శివ పాల్గొన్నారు.