May 13,2023 20:59

- హార్సిలీహిల్స్‌లో అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతాన్నిపరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీష

బి.కొత్తకోట  : అన్నమయ్య జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం, ఆంధ్రా ఊటీగా విరాజిల్లుతున్న హార్సిలీహిల్స్‌లో సాహస క్రీడలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ గిరిష ఆదేశించారు. శనివారం ఆయన హార్సిలీహిల్స్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో సాహస క్రీడలు ఏర్పాటుకు అనువుగా ఉందా లేదా అని నిపుణులతో కలిసి పరిశీలించారు. ఎటివి వెహికల్స్‌, రాప్లింగ్‌, పర్యాటకులు కోసం ట్రెక్కింగ్‌ తదితర కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యచరణ చేయాలని అధికారులను ఆదేశించారు. హార్సిలీహిల్స్‌ మరింత అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొండకు వచ్చే పర్యాటకులు విడిది చేయడానికి వీలుగా అనువైన సౌకర్యాలతో పాటు, చిన్న పిల్లలు ఆడుకునేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే అతిథులకు అందించే సౌకర్యాలు, సేవలు సందర్శకులను ఆకట్టుకునేలా మరింత అభివద్ధి చేయాలని తద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచాలన్నారు.దేశం నలుమూలల నుండి పర్యాటకులు హార్శిలీహిల్స్‌కు విచ్చేసి ఇక్కడి ప్రకతి అందాలను ఆస్వాదిస్తారన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. కలెక్టరుతోపాటు మదనపల్లి ఆర్‌డిఒ మురళీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.