May 03,2022 21:31

-మూడు నెలలు కావొస్తున్నా విడుదల కాని ఉత్తర్వులు
-మోసపోయామంటున్న ఉద్యోగ సంఘ నాయకులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :
పిఆర్‌సి ఆందోళన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కూడిన స్టీరింగ్‌ కమిటీతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం వెంటనే ఇవ్వాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇంతవరకు ఇవ్వకపోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. నమ్మి మోసపోమాయని చెబుతున్నారు. పిఆర్‌సిలో న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి మూడో తేదీన ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం అనంతరం ప్రభుత్వం దిగొచ్చి వారితో చర్చించింది. మొత్తం 17 అంశాలపై అగ్రిమెంటు చేసుకుంది. వాటిల్లో సిపిఎస్‌ కూడా ప్రధాన అంశంగా ఉంది. మార్చిలోపు సిపిఎస్‌ రోడ్‌మ్యాప్‌ ఏర్పాటు చేస్తామంది. తాజాగా జిపిఎస్‌ను తీసుకొచ్చింది. దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఇటీవల జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఉద్యోగ సంఘాల నాయకులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయినా చలనం లేదు. పైగా జిపిఎస్‌ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలంటూ ప్రకటన ఇచ్చేసింది. దీంతో సిపిఎస్‌ వ్యవహరం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. మార్చిలో రోడ్‌ మ్యాప్‌ ఏర్పాటు చేసి జూన్‌లోపు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చిన ప్రభుత్వం పథకం లక్ష్యాన్నే మార్చేసింది. ముఖ్యంగా పిఆర్‌సిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా 10 ఏళ్లకు మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఐదేళ్లకు మారుస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన చర్చల్లో హామీ ఇచ్చారు. అదీ అమలుకు నోచలేదు. ఐఆర్‌ రికవరీ చేయబోమనీ తెలిపారు. పిఆర్‌సిలో రికవరీ అని పేర్కొన్న నేపథ్యంలో అటువంటిదేమీ ఉండకూదని, దానిపైనా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అదీ జరగలేదు. ఆర్‌టిసి పిటిడికి ఉద్యోగులు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల పిఆర్‌సికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్‌ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అగ్రిమెంట్లో పేర్కొన్నారు. అదీ జరగలేదు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులు చేసుకున్న అగ్రిమెంటులోనే సమ్మెను రద్దు చేసుకుంటున్నామని ఉద్యోగ సంఘాలు ప్రకటించినట్లు పొందుపరిచారు. సమ్మె ఆగిపోయింది మినహా ఉద్యోగుల సమస్యలు పెద్దగా పరిష్కారానికి నోచలేదు. ఇచ్చిన హామీల్లో నివేదికను బయటపెట్టడం, హెచ్‌ఆర్‌ఏ, సిపిఏ, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ సమస్యలపై ఉత్తర్వులు ఇచ్చారు. మట్టి ఖర్చులు రూ.26 వేలకు పెంచిన అంశంపై ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు.
 

                                                                యుటిఎఫ్‌ ఆందోళన

సిపిఎస్‌ను రద్దు చేయాలని, పిఆర్‌సిలో ఫిట్‌మెంట్‌ కనీసం 27 శాతంగా ఉండాలని కోరుతూ యుటిఎఫ్‌, ఎపిటిఎఫ్‌, ఎస్‌టియు సంఘాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం ససేమిరా అనడంతో స్టీరింగ్‌ కమిటీ నుండి బయటకు వచ్చేశాయి. అనంతరం యుటిఎఫ్‌ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్దఎత్తున మోహరించి ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. అయినా పోరాటాన్ని కొనసాగించామని యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాదు తెలిపారు.