Jun 04,2023 21:09

హామీల అమలులో ప్రభుత్వం విఫలం- జీపు జాతాలో రాష్ట్ర నాయకులు

రాయచోటి : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు హామీలను అమలు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రారంభమైన జీపు జాతా ఆదివారం రాయచోటి ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకోగానే మున్సిపల్‌ కార్మికులు ప్రచార జాతాలోని రాష్ట్ర నాయకత్వానికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి కళాకారులు పాడిన గీతాలు స్థానిక ప్రజానీకానికి ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్‌.లక్ష్మి నారాయణ, బి.గోపి, ఎటిఎం నాగరాజులు పేర్కొన్నారు. ముఖ్య మంత్రి జగన్‌ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీ లపై అమీతుమీ తేల్చుకోవడానికి సంసిధ్ధమయ్యామని పేర్కొన్నారు. జగన్‌ ప్రతిపక్షంలో మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి ఆప్కాస్‌లో చేర్చి చేతులు దులుపు కున్నారని విమర్శించారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు జీతంలో పెరుగుదల లేదని హెల్త్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలన్నారు. అరమరిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్‌ మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యం కల్పించాలని 010 పద్దు కింద జీతాలివ్వాలని ఫనిభారం తగ్గించి అధికారుల వేధింపుల నివారణకు క షి చేయాలని చెప్పారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ అవకతవకలపై విచారణ జరిపించాలని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. మాస్క్లు గ్లౌజులు కొబ్బరినూనె, చెప్పులు ఇవ్వలేదని తెలిపారు. మూడు నెలల హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం అధికారులకు తగదని కనీస వేతనం 26 వేలు అమలు చేసే దాకా పోరాడతామని చెప్పారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిం చడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే వచ్చే ఎన్నికల్లో వారు బుద్ధి చెప్తారని హెచ్చరిం చారు. జాతాలో నాయకులు ముత్యాలరావు, నాగేంద్ర, శ్రీనివాసులు, రామాం జనేయులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగబసిరెడ్డి, మున్సిపల్‌ కార్మి కులు రాంబాబు, అగ్గిరామయ్య, సిద్దయ్య, మంగమ్మ, వెంకట్రామణ, ఓబులేసు, మంగమ్మ, మాధవి, సిఎం.లక్ష్మిదేవి, రమణమ్మ, శంకరయ్య పాల్గొన్నారు.
బి.కొత్తకోట : ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలపై అమీతుమీ తేల్చుకోవడానికి సంసిధ్ధమయ్యారని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.నాగేంద్ర బాబు పేర్కొన్నారు. మున్సిపల్‌ రాష్ట్ర జీపు జాతా ఐదో రోజు బి.కొత్తకోట చేరుకోగా మున్సిపల్‌ కార్మికులు ప్రచార జాతాలోని రాష్ట్ర నాయకత్వానికి పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. జాతాకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.సురేంద్ర బాబు అధ్యక్షత వహించగా నాగేంద్ర బాబు మాట్లాడుతూ బి.కొత్తకోటలో గుర్తించిన 20 ఏళ్ల నుండి పని చేస్తున్న కార్మికుల జీతాల్లో కానీ జీవితాలలో కానీ మార్పు లేదనీ, ప్రతిపక్షంలో మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి నాలుగేళ్లయినా కనీసం ఆప్కాస్‌లో కూడా చేర్చకుండా చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు అవుల శ్రీనివాసులు, కె.రామాంజి, సి.రామకృష్ణ, జి.మారతమ్మ, లక్ష్మి నరసమ్మ, గంగులమ్మ, రామ లక్ష్మమ్మ పాల్గొన్నారు. జాతా బి.కొత్తకోట నుంచి చిత్తూరు జిల్లా కుప్పంకు వెళ్లింది.