ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థునుల కన్వెన్షన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమైంది. ఈ కన్వెన్షన్ లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి , ఎస్ ఎఫ్ ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు, సిహెచ్ పావని, రాష్ట్ర విద్యార్దినుల కో కన్వీనర్ కె.నవిత, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్న కుమార్, రాష్ట్ర కార్యదర్శి ,ఎం.అశోక్, లయోలా ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఈ.వంశీ కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. చంద్రయాన్ విజయంలో 100మంది మహిళా శాస్త్రవేత్తలు భాగ స్వాములయ్యారని వివరించారు. నేడు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. స్త్రీ పురుషులకు చట్టాలు సమానం అంటున్నా మహిళలు సమాజంలో వివక్షతకు గురవుతున్నారని అన్నారు. పితృస్వామ్య సమాజంలో ఆడపిల్లలకు చిన్నప్పటి నుండి పిరికితనాన్ని నూరుపోస్తున్నారని చెప్పారు. ఆడపిలల్లు హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. ఆడపిల్లలను ప్రేమ వ్యామోహలకు గురిచేసే సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి మహిళా శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.










