Apr 30,2023 21:35

ఫొటో : ఎంఎల్‌ఎ రామిరెడ్డిని, ఎంపి బీదను సన్మానిస్తున్న దృశ్యం

ఘనంగా 'సంయుక్త' వార్షికోత్సవం
ప్రజాశక్తి-కావలి : సంయుక్త సేవాసంస్థ 8వ వార్షికోత్సవం ఆదివారం స్థానిక ఎస్‌బిఐ పక్కనున్న ది హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్‌ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 8 సంవత్సరాలుగా సంస్థకు సహాయం అందజేసిన దాతలకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, బీదా మస్తాన్‌రావులు సన్మానం చేసి, జ్ణాపికలను అందజేశారు. అనంతరం డాక్టర్‌ కె.శ్రీనివాసులు - వసంతలు ముఖ్య అతిథుల మీదుగా ఇద్దరు పేద మహిళలకు స్వయం జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థ ద్వారా దాతల సహకారంతో ఆటో డ్రైవర్‌ సురేంద్ర చేస్తున్న సేవలను ఎంతగానో అభినందించారు. సంయుక్త సేవాసంస్థ కార్యాలయానికి అవసరమైన అద్దెను ఇకనుంచి బిఎంఆర్‌ చారి టబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కడతామని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్‌ రావు హామీనిచ్చారు. అలాగే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర కుమార్తె లిఖిత డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టుకోవడానికి స్థలం, బిల్డింగ్‌, నిర్మించుకోవడానికి అవసరమైన నిధులను కూడా అందించి సహాయ పడతామని తెలియజేశారు. ఈ వార్షికోత్సవంలో పాల్గొని నృత్య ప్రదర్శన ఇచ్చిన చిన్నారులకు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, బీదా మస్తాన్‌ రావులు రూ,10 వేలు కానుకగా అందజేశారు. పిల్లకు నృత్య శిక్షణ ఇచ్చిన సురేంద్ర కుమార్తె లిఖితను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, గంధం ప్రసన్నాంజనేయులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నగళ్ల శ్రీనివాస కిరణ్‌, డాక్టర్‌ బి సతీష్‌, డాక్టర్‌ పి.శ్రీధర్‌, నెల్లూరు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ దామిశెట్టి సుధీర్‌ నాయుడు, డాకారపు రవిప్రకాష్‌, డాక్టర్‌ విజరు భాస్కర్‌, డాక్టర్‌ శివప్రసాద్‌, డాక్టర్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, సంస్థ శాశ్వతదాతలు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.