ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో శనివారం నుంచి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఊటుకూరు సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి బాలకుమార్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన రాజంపేట జూనియర్ సివిల్ జడ్జి ఎం.సంధ్యారాణి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ పోస్కో, భరణం, విడాకులు, గృహహింస, వరకట్న వేధింపులు వంటి మహిళలకు సంబంధించిన అనేక చట్టాల గురించి వివరించారు. మహిళలకు పురుషులతో సమానంగా తల్లిదండ్రుల ఆస్తిపైన హక్కు ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో మహిళలు, సచివాలయ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఎంపిడిఒ కార్యాలయంలో..మూడవ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.ఎస్ మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఎంపిడిఒ కార్యాలయంలోని సభా భవనంలో మహిళలకు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో న్యాయవాదులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు పాల్గొని మహిళలకు సంబంధించిన అనేక చట్టాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు పాల్గొన్నారు.










