ప్రజాశక్తి-కంచికచర్ల: మండలంలోని గొట్టుముక్కల సమీపంలోని అడవి ప్రాంతంలో గల మద్దులమ్మ తల్లికి వరదపాశం కార్యక్రమం వేలాది మంది ప్రజల మద్య ఆదివారం అట్టహాసంగా సాగింది. అడవిప్రాతంలో జలపాతం వద్ద మద్దులమ్మ తల్లికి పురాతన చరిత్ర ఉంది. తొలకరి రోజుల్లో వర్షాలు సకాలంలో పడకపోతే గొట్టుముక్కల, వీరులపాడు మండలం, నరసింహరావుపాలెం గ్రామస్తులు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, పాలపొంగళ్ళను జలపాతంపై నీటిలో కలిపి వరదపాశం పోస్తే, దేవాలయం వద్దకు వెళ్లిన ప్రజలు ఇంటికి వచ్చేసరికే వర్షాలు కురుస్తాయనేది నానుడి. అయితే చిట్టడివిలో మద్దులమ్మ దేవాలయం ఉండటంవల్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడేవి. గొట్టుముక్కల గ్రామం నుంచి మద్దలమ్మ దేవాలయం వరకు అడవిలో సైతం రోడ్డు నిర్మాణానికి నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నిధులతోపాటు ఆలయ కమిటి నిర్వాహాకులు పార్టీలకు అతీతంగా గొట్టుముక్కల, నరసింహరావుపాలెం, నక్కలంపేట, కంచికచర్ల గ్రామాస్తుల సహాకారంతో చందాలు వసూళ్ళు చేసి ఈ ఏడాది రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆదివారం మద్దలమ్మ దేవాలయంలో పాలపొంగళ్ళతో ప్రత్యేక పూజలు చేసి జలపాతంపై వరదపాశం పోశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది కుటుంబ సభ్యులతో కలిసి కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా దేవాలయ ప్రాంగణం వద్ద పది వేల మంది అన్నదానం నిర్వహించారు. నందిగామ ఎమ్మెల్యే డా||మొండితోక జగన్మోహనరావు,మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు మద్దులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొట్టుముక్కల గ్రామం నుంచి అడవి ప్రాంతంలో గల మద్దులమ్మ దేవాలయం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితక జగన్మోహనరావు హామి ఇచ్చారు. అడవి ప్రాంతంలో గల మద్దులమ్మ దేవాలయం ప్రాంగణం రాబోయే కాలంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని సందర్శకులు అంటున్నారు. ఇప్పటికై ప్రతి ఆదివారం కంచికచర్ల, వీరులపాడు మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతోపాటు, విజయవాడ, మంగళగిరి,నరసరావుపేట ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహానాల్లో యాత్రికులు వస్తున్నారు. ఆదివారం వరదపాశం కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలిరావటంతో నందిగామ రూరల్ సీఐ ఐవి నాగేంద్ర కుమార్ అధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. గొట్టుముక్కల గ్రామ మాజీ సర్పంచ్ గుదే రంగారావు, ఎంపీటీసీ గుదే సరస్వతి, వైసీపీ నాయకులు గుదే బుజ్జి, గుదే చిన్ని, గుదే అక్కారావు , తాటూకూరు గంగాధరరావు, తంగెళ్ళమూడి రామారావు, తాటుకూరి అమ్మారావు, గ్రామ సర్పంచ్ తుల్లిమెళ్లి రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ గోగినేని అమర్‌నాద్ తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో వృద్ధుడు మృతి
వీరులపాడు మండలం నరశింహారావుపాలెం గ్రామానికి చెందిన జంగా నాగిరెడ్డి (64) కొండపైకి ఎక్కుతుండగా అలసటకు గురై గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు తేరుకునేలోపే మృతిచెందాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాన వేసుకుని కొండ పైనుండి దిగి స్వగ్రామానికి తరలించారు. కొండపై వృద్ధుడు మృతిచెందటంతో ఒక్క సారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు.










