Mar 08,2023 21:43

ఫొటో : మాట్లాడుతున్న ఐద్వా నాయకులు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ప్రజాశక్తి-మర్రిపాడు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో మహిళలు ఐద్వా జెండాను ఎగురవేసి మహిళా దినోత్సవాన్ని మండల అధ్యక్ష కార్యదర్శులు శ్యామలమ్మ, మూలి ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్‌ లెక్చరర్‌, మోటివేటర్‌ భారతి పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు గొప్ప స్థానం ఉందని, ఒక తల్లిగా సోదరిగా, భార్యగా, సన్నిహితురాలిగా గొప్ప పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం, అంకితం చేస్తున్నారని తెలిపారు. అలాంటి స్త్రీమూర్తులం దరిని గౌరవించేలా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకుంటామని, స్త్రీ సంపూర్ణ సాధికారత సాధించడానికి వారు స్వేచ్ఛగా జీవించడానికి సమాజం ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు.
పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని హక్కులు అధికారాలు సాధించినప్పుడే సంపూర్ణ మహిళలగా ఉంటుందన్నారు. స్త్రీ ఆర్థిక స్వావలంభనతో స్వశక్తిపై నిలబడాలన్న సాధికారిత సాధించాలన్నా చట్ట సభలలో వారికి సంఖ్యాబలం ఉండాలన్నారు. నేడు ఎక్కడో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వం వాటిని అరికట్టాలన్నారు. సమాజ సేవలో ఉత్సాహంగా పాల్గొంటున్న మండల స్థాయి మహిళా మణులను యుటిఎఫ్‌ మండల శాఖ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చలపతి శర్మ, ప్రధాన కార్యదర్శి వి వి శేషులు, రాష్ట్ర సీనియర్‌ నాయకులు శ్రీహరి, జిల్లా కార్యదర్శి మోహన్‌ ప్రసాద్‌, సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య, ఆవాజ్‌ మండల ఉపాధ్యక్షులు రహమతుల్లా, కార్యదర్శి ఎస్‌డి గౌస్‌ బాషా, మహిళలు పాల్గొన్నారు.