May 09,2023 19:41

అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : మదనపల్లి మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ వేంపల్లి దళితవాడలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ పెద్ద బైనేని నరసింహులు, బండకోట వెంకటరమణ, ఆవుల వెంకటరమణ, బైనేని రఘు, వేంపల్లె రవిల సంయుక్త ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డాక్టర్‌ బి.అర్‌.అంబేద్కర్‌ ఆలోచన, ఆశయాల స్ఫూర్తితో అంబేద్కర్‌ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో దళితవాడ ప్రజలు పెద్దలు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. భారతరత్న డాక్టర్‌ బి.అర్‌.అంబేద్కర్‌ స్పూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సమాజంలోని అసమానతలను తొలగించేలా, చట్టాలను రాజ్యాంగంలో పొందు పరిచిన మహా మేధావి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలనలో ఆ మహనీయుడు సమాజానికి దిక్సూచి అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో రవి, వేంపల్లి యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.