- దాదాపు 80 దేశాల్లోని భారతీయ నావికులు సంఘీభావం
- అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు
- ప్రపంచ కార్మిక సంఘాలు మద్దతు
- కార్పొరేట్, మతోన్మాద పాలన నుండి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు కంకణబద్ధులయ్యారు : సిఐటియు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని కార్పొరేట్, మతోన్మాద పాలన నుండి దేశాన్ని రక్షించుకునేందుకు నిర్ణయించుకుంది. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా, దేశ పరిరక్షణకు సంబంధించిన 12 డిమాండ్లతో రెండు రోజుల పాటు జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సమ్మె జరిగింది. ఎస్మా, బెదిరింపులు, అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొని సమ్మెలో పాల్గొనేవారి సంఖ్య 20 కోట్లు దాటింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల అత్యున్నత చర్యలకు పాల్పడ్డారు. దాదాపు 80 దేశాల్లోని భారతీయ నావికులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రపంచ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. దేశంలో జరుగుతున్న సమ్మెపై అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ఇచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు కార్మిక వర్గానికి, దేశ ప్రజలకు సిఐటియు అభినందనలు తెలిపింది.
2020 నవంబర్‌లో అంతకుముందు జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గన్న వారి కంటే ఎక్కువ మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. అన్ని రంగాల కార్మికుల నుంచి అపారమైన స్పందన లభించింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం యజమానులు, ప్రభుత్వాల నుండి బెదిరింపులు ఉన్నప్పటికీ, ఇది దేశ చరిత్రలో అతిపెద్ద సమ్మెల్లోఒకటిగా నిలిచింది. కార్మికులు, ఉద్యోగులు ఈ బెదిరింపులను పక్కనబెట్టి సమ్మెలో పాల్గన్నారు. కొచ్చిన్ రిఫైనరీ కార్మికులు, కేరళలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన చట్టవిరుద్ధమైన ఆదేశాలను పట్టించుకోలేదు. రెండు రోజులు కూడా సమ్మెను కొనసాగించారు. రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు మన దేశ ప్రజల నుండి మాత్రమే కాకుండా అంతర్జాతీయ మద్దతు, సంఘీభావం లభించింది. ఇది అంతర్జాతీయంగా భారీ దఅష్టిని, అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమం నుండి భారీ సంఘీభావాన్ని పొందింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్‌తో పాటు పలు కార్మిక సంఘాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. ప్రస్తుతం ఖండాలు, మహాసముద్రాల్లో వివిధ దేశాల్లో ఉన్న భారతీయ నావికులు తమ సంఘీభావాన్ని తెలిపారు.
రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు భారీ స్పందన లభించింది. ఆర్థిక వ్యవస్థలోని వ్యూహాత్మక రంగాలైన విద్యుత్, పెట్రోలియం, బగ్గు, హైడల్ ప్రాజెక్టులు, పవర్‌గ్రిడ్, రోడ్డు రవాణాతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, హర్యానా, ఎన్‌సిఆర్ (ఢిల్లీ) ప్రాంతంలోని బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సి)లతో సహా ప్రైవేట్ రంగంలో ఆధునిక పారిశ్రామిక యూనిట్లు మూతపడ్డాయి. బ్యాంకులు, బీమా కంపెనీల్లోని కార్మికులు, ఉద్యోగులు దేశంలో ఎక్కడా తమ పని ప్రదేశాల్లోకి ప్రవేశించలేదు. పోస్టల్ డిపార్ట్‌మెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆడిట్, జిఎస్‌ఐ తదితర విభాగాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్దఎత్తున సమ్మెలో పాల్గన్నారు. వైజాగ్ స్టీల్, ఆయిల్, ఎల్‌పిజి ప్లాంట్లు, కాపర్, టెలికాం సెక్టార్, సిమెంట్ రంగ కార్మికులు మార్చి 28 ఉదయం నుంచి పెద్దఎత్తున సమ్మె చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగారు. ట్యుటికోరిన్, పారాదీప్‌లోని ఓడరేవు కార్మికులు కూడా పనిచేశారు. రైల్వే, రక్షణ శాఖ ఉద్యోగులు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. జ్యూట్, ప్లాంటేషన్ రంగాలలో కూడా సమ్మె పిలుపుకు భారీ స్పందన కనిపించింది. మత్స్యకారులు కూడా ఉదయం సముద్రంలోకి వెళ్లలేదు. అసంఘటిత రంగంలోని నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, వీధి వ్యాపారులు మొదలైనవారు సమ్మెలో పాల్గనడమే కాకుండా దేశంలోని వేలాది ప్రదేశాలలో రోడ్ల దిగ్బంధనం, రైలు దిగ్బంధన ప్రదర్శనల్లో పాల్గన్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లతో సహా దాదాపు 80 లక్షల మంది స్కీమ్ వర్కర్లు ఆయా రంగాల్లో సమ్మెను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సార్వత్రిక సమ్మె కారణంగా కేరళ, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార?ండ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని అనేక జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రజా రవాణా నిలిచిపోవడంతో బంద్ వంటి పరిస్థితి ఏర్పడింది. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాలలో సమ్మె గణనీయంగా ఉంది. సిక్కింలో కూడా భద్రతా కార్మికులు సమ్మెకు దిగారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్‌లో పారిశ్రామిక ప్రాంతాలు సమ్మెలో ఉన్నాయి. తమిళనాడులో 300 చోట్ల 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను పికెట్ చేశారు.
అనేక రాష్ట్రాలు, అనేక రంగాలల్లో రెండో రోజు సమ్మెలో కార్మికులు, ఉద్యోగుల భాగస్వామ్యం పెరిగింది. ఎన్‌పిఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌పై దఅష్టి సారించిన యువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో రోజు సమ్మెను విస్తఅతం చేయడానికి చొరవ తీసుకున్నారు. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లలో కూడా హైడల్ పవర్ ప్రాజెక్టుల్లో కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గన్నారు. జార్ఘండ్‌లో ఎక్కువ మంది రోడ్డు రవాణా కార్మికులు సమ్మెలో పాల్గన్నారు. అస్సాంలోని చమురు కంపెనీల పికెట్ లైన్లలో ఎక్కువ మంది కార్మికులు చేరారు. పుదుచ్చేరిలో సమ్మె బంద్‌గా మారింది. తోషిబా, బాష్, శాండ్విక్, సీట్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర బహుళజాతి కంపెనీల కార్మికులు రెండు రోజుల సమ్మెలో పాల్గని భారీ ప్రదర్శనలు నిర్వహించారు. బ్లాక్, దిగువ స్థాయిలతో సహా వేలాది చోట్ల భారీ ప్రదర్శనలు జరిగాయి. ఇందులో అన్ని రంగాలకు చెందిన లక్షలాది మంది కార్మికులు, సంఘటిత రంగం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, గ్రామీణ కార్మికులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గన్నారు.
- కార్పొరేట్, మతోన్మాద పాలన నుండి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు కంకణబద్ధులయ్యారు : సిఐటియు
కార్పొరేట్, మతోన్మాద పాలన నుండి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు కంకణబద్ధులయ్యారని సిఐటియు స్పష్టం చేసింది. సమ్మెను నిషేధిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా సమ్మెలో పాల్గనడం ప్రాథమిక హక్కును పరిరక్షించడానికి కోసం వారికున్న సంకల్పాన్ని సిఐటియు అభినందించింది. కార్మికవర్గం ప్రాథమిక హక్కులను కాపాడటానికి వారి పోరాటంలో అండగా నిలుస్తుందని సిఐటియు హామీ ఇచ్చింది. కార్మిక, ప్రజా వ్యతిరేక దేశ వ్యతిరేక విధానాలను ఒడిసిపట్టేంత వరకు ఐక్యతను పటిష్టం చేసి అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లి పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని సిఐటియు కార్మికులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నయా ఉదారవాద విధానాలపై ఐక్యంగా పోరాడి ఓడించడమే కాకుండా, ప్రత్యామ్నాయ ప్రజానుకూల విధానాల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల శ్రమజీవుల ఆవశ్యకతను సిఐటియు నొక్కి చెప్పింది. దేశ కార్మికులు, ప్రజలు తమ జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవడంతోపాటు దేశ స్వావలంబన, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు మరింత ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చింది. సిఐటియు ఐక్యతను విస్తృతం చేయడానికి, 'దేశాన్ని, ప్రజలను రక్షించడానికి' ఐక్య పోరాటాలను ఉదృతం చేయడానికి తాను చేయగలిగిన అన్ని ప్రయత్నాలను చేయడానికి తన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుంది.
- కార్మిక, కర్షక ఐక్యత : ఎఐకెఎస్
కార్పొరేట్ అనుకూల, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారని ఎఐకెఎస్ స్పష్టం చేసింది. రెండు రోజుల సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికులు, కర్షకులు ఏకమయ్యారని పేర్కొంది. కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన గ్రామీణ సమ్మె (గ్రామీణ భారత్ బంద్)కు భారీ మద్దతుగా నిలిచిన కోట్లాది మంది కార్మికులు, రైతులు, పేదలకు అఖిల భారత కిసాన్ సభ అభినందనలు తెలియజేసింది. కార్మికులు, వ్యవసాయ కార్మికుల సంఘీభావంతో కార్మికవర్గం చేపట్టిన సమ్మె సందర్భంగా భారీ ప్రచారం నిర్వహించారు. ర్యాలీలు, బైక్ ప్రదర్శనలు, 12 గంటల రోడ్ రోకో, చక్కా జామ్‌ను నిర్వహించినట్లు తెలిపింది. అస్సాంలో రెండు రోజులు నగరాలతో పాటు గ్రామాల్లో సమ్మెకు మద్దతు లభించింది. అనేక మంది కార్యకర్తలు అరెస్టు అయ్యారు. 1,148 మంది కార్మిక సంఘాలు, కిసాన్ సభ కార్యకర్తలను అరెస్టు చేశారు. బస్సులు రోడ్లపైనే నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్‌లలో కూడా నిరసనలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బీహార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమ్మె జరిగింది. కార్పొరేట్ దోపిడీని ప్రోత్సహించే విధానాలను ప్రతిఘటించి, దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తారనే స్పష్టమైన సందేశం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి దేశంలోని కార్మికులు, రైతులు, ప్రజానీకం ఇచ్చారని ఎఐకెఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, హన్నన్ మొల్లా అన్నారు.










