- స్థంభించిన పారిశ్రామిక నగరాలు
- పలు ప్రాంతాల్లో బంద్ వాతావరణం
- ఎల్‌ఐసిలో సంపూర్ణం... మూతపడిన బ్యాంకులు
- రైతుల సంఘీభావ ప్రదర్శనలు
- మద్దతుగా పార్లమెంటు నుండి వాకౌట్ చేసిన వామపక్ష ఎంపిలు
సార్వత్రిక సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెలో భాగంగా తొలిరోజైన సోమవారం కార్మికలోకం కదం తొక్కింది. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడతామని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు. దేశవ్మాప్తంగా అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహాు భోజనం తదితర రంగాలకు చెందిన స్కీమ్ వర్కర్లే 80 లక్షల మంది సమ్మె చేశారని అంచనా! దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ భారీ ప్రదర్శనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు మారుమ్రోగాయి. లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్లమీదకు రావడంతో కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో బంద్ వాతావరణం నెలకొంది. ఈ రాష్ట్రాల్లో ప్రజారవాణా కూడా నిలిచిపోయింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, హర్యానా, అస్సాంలలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనూ సమ్మె విజయవంతమైంది. విజయవాడతో పాటు అన్ని జిల్లాల్లోనూ కార్మికులు ప్రదర్శనలు, సభలు నిర్వహించారు.సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పారిశ్రామిక నగరాలు, వాడల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కోల్‌కత్తా, ముంబాయి వంటి నగరాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులూ సమ్మెలో భాగస్వాములయ్యారు. సింగరేణిలో దాదాపు నూరుశాతం సమ్మె జరిగింది. బిహెచ్‌ఇఎల్ యూనిట్లలోనూ పనులు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించారు. పోస్టల్, ఇన్‌కంటాక్స్ వంటి శాఖల్లో పనలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎల్‌ఐసిలో సమ్మె సంపూర్ణంగా జరిగింది. అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. సమ్మెకు మద్దతుగా వామపక్ష ఎంపిలు పార్లమెంటు నుండి వాకౌట్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు కార్మికులకు మద్దతుగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు.





















