- మోడీని గద్దె దించే వరకూ పోరాటం : కార్మిక సంఘాలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/కార్పొరేషన్ : కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం జిల్లాలో చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో సభ నిర్వహించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ప్రదర్శన చేపట్టారు. రాజ్ విహార్ కూడలి, ధర్నా చౌక్, బుధవార పేట మీదుగా ప్రదర్శన సాగింది. కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ సంస్థలు ముద్దు..ప్రయివేటు సంస్థలు వద్దే వద్దు, మోడీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. మోడీని గద్దె దించే వరకూ పోరాటం సాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో సిఐటియు నగర కార్యదర్శి విజరు, ఎఐటియుసి నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్ దేశారు మాట్లాడుతూ కార్మిక సంఘాల బంద్‌కు దుకాణదారులు కూడా స్వచ్ఛందంగా సహకరించారన్నారు. ఆటో కార్మికులు కూడా బంద్‌లో కీలక పాత్ర పోషించారన్నారు. మోడీ ప్రభుత్వానికి అసంఘటిత రంగ కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాకా ప్రభుత్వ రంగ సంస్థలను గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారన్నారు. ప్రజల రుణాలు ఒక్క రుపాయి కూడా మాఫీ చేయకుండా రూ.8లక్షల కోట్ల గుత్తపెట్టుబడిదారుల రుణాలు మాఫీ చేశారన్నారు. మోడీ పాలనలో 6 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాకా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. శవాలను పూడ్చుకునేందుకు కూడా స్థలాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ విధంగా భూములన్నీ ప్రయివేటు పరం అవుతాయని అన్నారు. మోడీకి గోరీ కట్టేందుకు కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు
చేసేందుకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళ కన్వీనర్ పి.నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వ రంగాలు లేకుంటే ప్రభుత్వమే లేదని, అలాంటి
ప్రభుత్వ రంగాలను ప్రయివేటీకరించడం చాలా దుర్మార్గమని అన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ ఊరుకునేది లేదన్నారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే మోడీ ప్రభుత్వానికి పడుతుందన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథం మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, సాగు మోటర్లకు వ్యవసాయ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మెకు మద్దతుగా యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్ కుమార్ మాట్లాడుతూ అన్ని రంగాలకూ మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్ర చేతుల్లోకి తీసుకుందన్నారు. కార్మిక సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. అంగన్ వాడీ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ, ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రభాకర్, బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మహేష్, రామరాజు, మెడికల్ రెప్స్ యూనియన్ నాయకులు రవీంద్రారెడ్డి, ఐఎన్‌టియుసి నాయకులు బతుకన్న, ఎఐయుటియుసి నాయకులు నాగన్న, ఎఐబిఇఎ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పోస్టల్ యూనియన్ నాయకులు లక్ష్మీకాంత్ మాట్లాడారు.










