General Strike: కేంద్రంపై కన్నెర్ర - హోరెత్తిన బిజెపి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు
- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు, మానవహారాలు
- రాష్ట్రంలో రెండ్రోజుల సార్వత్రిక సమ్మె విజయవంతం
ప్రజాశక్తి - యంత్రాంగం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, ఉద్యోగ సంఘాలు చేపట్టిన రెండ్రోజుల సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో విజయవంతమైంది. మంగళవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు, మానవహారాలు నిర్వహించారు. బిజెపి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో .జిల్లా, మండల కేంద్రాలు హోరెత్తాయి. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు కదంతొక్కుతూ పలుచోట్ల భారీ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. గ్రామాల్లో బంద్ వాతావరణం కనిపించింది. పలుచోట్ల తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. బ్యాంకింగ్, బీమా, విద్యుత్, ఉక్కు, పోస్టల్, టెలికం, రవాణా తదితర రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములయ్యారు. అధిక ధరలు అరికట్టాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలని, కనీస వేతనం కావాలని, మద్దతు ధరల చట్టం తీసుకురావాలని కార్మిక, కర్షకులు నినదించారు.
- విశాఖలో మహాప్రదర్శన
విశాఖ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు 100 శాతం, పర్మినెంట్ కార్మికులు 80 శాతం, హెచ్‌పిసిఎల్ కార్మికులు 75 శాతం మంది విధులను బహిష్కరించారు. బిహెచ్‌ఇఎల్, ఆటోనగర్, జివిఎంసి కార్మికులు సమ్మెలో పాల్గన్నారు. ఎల్‌ఐసి, బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. విశాఖ నగరంలోని రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు వేలాది మందితో మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆశీల్ మెట్ట జంక్షన్ వద్ద జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ... దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముక లాంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం చూస్తోందని తెలిపారు. సంపద సృష్టిస్తున్న కార్మికులకు నెలకు రూ4,157 జీతంగా నిర్ణయించారని, ఇది చట్టవ్యతిరేకమని, కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలను అదుపు చేయాలని కోరారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణ మూర్తి, శ్రామిక మహిళా కన్వీనర్ పి.మణి పాల్గన్నారు. విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. పెదబయలులో కూరగాయల దండలను మెడలో వేసుకుని అర్ధనగంగా వినూత్నరీతిలో నిరసన తెలిపారు. అనకాపల్లి పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యాన ర్యాలీ, నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మానవహారం నిర్వహించారు. నక్కపల్లిలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యాన ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలి వద్ద కార్మికులు బైటాయించారు. ఈ సందర్భంగా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

- దివాలా కోరు విధానాలకు స్వస్తి పలకాలి : గఫూర్
కృష్ణాజిల్లాలో 51 మండల కేంద్రాల్లో మానవహారాలు నిర్వహించారు. గ్రామాల్లో సచివాలయాల వద్ద రైతు, కౌలురైతులు నిరసన తెలిపారు. విజయవాడ వన్‌టౌన్‌లోని హెడ్‌పోస్టాఫీసు వద్ద నిర్వహించిన మానవహారంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అన్ని రంగాల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తున్న దివాలా కోరు విధానాలకు ప్రధాని మోడీ స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. రైల్వేస్టేషన్ వద్ద జరిగిన నిరసనలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమమాహేశ్వరరావు, మాచవరంలోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద జరిగిన మానవహారంలో రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు పాల్గన్నారు. కర్నూలులో హెడ్‌పోస్టాఫీసు వద్ద నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి కొండారెడ్డి బురుజు వరకూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్‌టియు, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నంద్యాల మండలం ఐలూరు గ్రామంలో నిర్వహించిన రాస్తారోకోలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రమేష్‌కుమార్ పాల్గన్నారు. నందికొట్కూరులో వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఎమ్మిగనూరులో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నాగమణి, చాగలమర్రిలో ఎఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చంద్రకళ, సిఐటియు రాష్ట్ర నాయకులు గుత్తి నరసింహుడు పాల్గన్నారు. మహానంది, మంత్రాలయం తదితర మండలాల్లో మానవహారాలు నిర్వహించారు.


- రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన
అనంతపురం జిల్లా రాయదుర్గం, అనంతపురంలలో ఆర్‌టిసి ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతపురంలో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు పాల్గన్నారు. చిలమత్తూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. కదిరిలో సిఐటియు రాష్ట్ర నాయకులు నూర్‌మహ్మద్, కొత్తచెరువులో విఆర్‌ఎల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న పాల్గన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి.నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు భీమారావు పాల్గన్నారు. ముమ్ముడివరం, రావులపాలెం, రాజోలు, అంబాజీపేట, ప్రత్తిపాడు, జగ్గంపేట, గొల్లప్రోలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన ప్రదర్శన, మానవహారంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సిపిఎం సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద సిఐటియు, ఐఎన్‌టియుసి ఆధ్వర్యాన ధర్నా చేశారు. వేపాడ మండలం బద్దాం, గంట్యాడ మండలం బుడతనాపల్లిలో రైతులు, సీతానగరం, బబ్బిలిలో కార్మికులు, పాచిపెంటలో జిసిసి కార్మికులు నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి డప్పులు మోగిస్తూ సూర్యమహల్ జంక్షన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద మానవహారం చేపట్టారు. పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. పలు మండలాల్లో పోస్టాఫీసుల వద్ద ఆందోళనలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెంలలో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఆకివీడు, పాలకొల్లులో తహశీల్దార్ కార్యాలయాల వద్ద, తణుకులో బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు.

- స్తంభించిన పోస్టల్, బ్యాంకింగ్ సేవలు
ప్రకాశం జిల్లాలో బ్యాంకింగ్, ఎల్‌ఐసి, పోస్టల్ సేవలు స్తంభించిపోయాయి. పట్టణ, మండల కేంద్రాల్లో కార్మికులు విధులు బహిష్కరించి మానవహారాలు చేపట్టారు. గుంటూరు నగరంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నరసింహారావు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు సుబ్బరాయుడు మాట్లాడారు. నరసరావుపేటలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్, కెఎన్‌పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ పాల్గన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్, ఇండియన్ పోస్టల్ సర్వీసు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరుకుమార్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఓబులేష్ పాల్గన్నారు. చిత్తూరు జిల్లా తపాలా కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. నెల్లూరు, కడప జిల్లాలో బైక్‌ర్యాలీలు, మానవహారాలు జరిగాయి.










