ప్రజాశక్తి - క్యాంపస్ : దేశ వ్యాప్తంగా 28, 29 తేదీలలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ గేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ శ్రావణి, ఉరుకుందు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే ఒక గుమస్తాగా తయారవడం సిగ్గుచేటని ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 3.25 లక్షల కోట్ల మేర ప్రభుత్వ సంస్థల్లో తన వాటాలను ఉపసంహరించుకొని ప్రయివేటుకు ధారాదత్తం చేయాలని కేంద్రం నిర్దేశించుకుందంటే కార్పొరేట్ కంపెనీల నమ్మిన బంటుగా పనిచేస్తుందనడంలో అతిశయోక్తి లేదని వాపోయారు. ప్రతిష్ఠాత్మకమైన ఆర్థిక, రక్షణ, సైన్స్ పరిశోధన లాంటి రంగాలలో ఒక్కొక్క రంగానికి గరిష్టంగా నాలుగు కంపెనీలు మినహా మిగిలిన నాన్‌కోర్ రంగానికి చెందిన 151 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటం ద్వారా రూ.1.76 లక్షల కోట్లు సంపాదించాలని ప్రతిపాదించిందని, ఆర్థిక రంగంలో ఐడిబిఐ బ్యాంకును, అదనంగా రెండు బ్యాంకులను, ఒక సాధారణ బీమా సంస్థను అమ్మకానికి సిద్ధం చేశారని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 28 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 బ్యాంకులుగా మార్చివేసి లక్షల మందిని నిరుద్యోగులుగా మార్చిన ఘనత నరేంద్రమోడీ గారిదేనని తెలిపారు.
భారతదేశంలో ప్రయివేటీకరణ చేసే దురుద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు అసమర్థంగా ఉన్నాయని, నష్టాలలో ఉన్నాయని, తగిన మూలధనం సమకూర్చటానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఈ ప్రభుత్వం ఆరేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.9 లక్షల కోట్లకు పైగా వ్యాపార లాభాలను సంపాదించాయని కాని ఇదే కాలంలో రూ.ఎనిమిదిన్నర లక్షల కోట్ల మొండి బాకీలు రద్దు చేసుకున్నాయని వీటిలో 85 శాతం మంది కార్పొరేట్ కంపెనీల అధిపతులుగా ఉన్నారని తెలిపారు. చిన్న చిన్న రుణాలు వసూలు కాకపోతే మంజూరు చేసిన మేనేజర్లను, అధికారులను జవాబుదారులుగా నిర్ణయించి చర్యలు తీసుకుంటున్న దేశంలో లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసిన డైరెక్టర్లు, ప్రభుత్వ అధిపతులు పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మనదేశ ఆర్థిక వనరులు విదేశీ గుత్త కంపెనీల హస్తగతమవ్వకుండ దేశ స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వావలంబనను కాపాడుకోవడం కోసం సార్వత్రిక సమ్మె కు విద్యార్థి లోకం మద్దతు తెలుపుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, శ్రావణ్, ఆకాష్, సాయితేజ, యువరాజ్, అన్నమయ్య, కళ్యాణ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.










