General Strike: బెట్టు వీడి.. సమస్యలు పరిష్కరించండి : పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్
- సమ్మెకు సంఘీభావంగా రెండో రోజూ వామపక్ష ఎంపీల ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం బెట్టు వీడి వీడి కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వామపక్ష ఎంపీలు రెండో రోజూ ఆందోళన కొనసాగించారు. కార్మిక డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేబూని నినాదాలిచ్చారు. అనంతరం పార్లమెంట్ నుంచి విజరు చౌక్‌కు మార్చ్ నిర్వహించారు. మరోపై కార్మిక సంఘాలు లేవనెత్తిన 12 డిమాండ్లపై చర్చించాలంటూ సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, సిపిఐ ఎంపి బినరు విశ్వం, కాంగ్రెస్ ఎంపి శక్తిసిన్హా గోయల్ 267 రూల్ కింద నోటీసులు ఇచ్చారు. వీటిని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ కలుగజేసుకుని దేశం మొత్తం సమ్మెలో ఉంది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై సభ చర్చించాలి. ఉపాధి లేమి, అధిక ధరలతో దుర్భరంగా మారిన ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఆయనకు బిజెడి ఎంపి అమర్ పట్నాయక్ పూర్తి మద్దతు తెలిపారు. సిపిఐ ఎంపి బినరు విశ్వం మాట్లాడుతూ కార్మిక సమ్మెకు పార్లమెంట్ బాధ్యత వహించాలన్నారు. దేశ సంపద సృష్టి కర్తలు. దేశం కోసం రక్తం చిందిస్తున్నవారు సమ్మెలో ఉన్నారు. న్యాయసమ్మతమైన వారి డిమాండ్లపై చర్చించాల్సిన బాధ్యత సభకు ఉందన్నారు. ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించి, చర్చకు ముందుకు రావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎంపి శక్తిసిన్హా గోయల్ మాట్లాడుతూ, ప్రభుత్వం బెట్టు వీడి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ముందుకు రావాలని కోరారు. కాంగ్రెస్ ఎంపి జైరాం రమేష్ మాట్లాడుతూ, ప్రైవేటీకరణ విధానాలపై చర్చించాలని కోరారు. చాలావరకు ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు పట్టుబట్టాయి. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన తృణమూల్ సభ్యుడు సౌగతా రారు సమ్మెకు భారీ స్పందన లభించిందని, ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల అసంతఅప్తిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. సభలో ఈ అంశంపై చర్చ జరగాలని కోరారు.











