Mar 29,2022 22:05
  • జెన్‌కో ప్రైవేటీకరణ సిగ్గుచేటు 

ప్రజాశక్తి-ముత్తుకూరు (నెల్లూరు జిల్లా) : నష్టాలతో నెల్లూరు జిల్లాలోనిశ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని (ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ను) నడపలేం కాబట్టి లీజుకు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఇన్ని వనరులున్న ప్రభుత్వానికి రాని ఆదాయాలు గుజరాత్‌లో ఉండే అదాని కంపెనీకి ఎలా వస్తాయని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ ఎదుట జెఎసి ఆధ్వర్యాన జెన్‌కో ఇంజినీర్లు, కాంట్రాక్ట్‌ కార్మికులు చేస్తోన్న పోరాటానికి మంగళవారం ఆయన మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశంలో ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ని లీజుకు ఇవ్వడంపై పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలము ప్రశ్నించామని, సభలో గందరగోళ పరిస్థితుల వల్ల ఈ అంశంపై చర్చ జరగలేదన్నారు. అయితే సంబంధిత మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ప్రయివేటు వారు ఒక యూనిట్‌ విద్యుత్తును రూ.2.40కు తయారు చేస్తున్నారని, ఎస్‌డిఎస్‌టిపిఎస్‌లో ఒక యూనిట్‌ విద్యుత్తు తయారీకి రూ.3.14 ఖర్చవుతోందని మంత్రి బదులిచ్చారన్నారు. ప్లాంట్‌ నిర్మాణానికి రూ.20 వేల కోట్ల అప్పులు తెచ్చామని, అప్పులు వడ్డీ కలిసి రూ.80 వేల కోట్ల పేరుకుపోయాయని, తప్పనిపరిస్థితుల్లో ప్లాంట్‌ని లీజుకు ఇవ్వాలనినిర్ణయం తీసుకున్నామని చట్టసభలో చెప్పడం సిగ్గుచేటన్నారు. రోజుకు800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌ను 400 మెగావాట్లకే ఎందుకు పరిమితం చేశారో చెప్పాలని, సగం సామర్థ్యంతో యూనిట్‌ నడిపితే నష్టాలు రాకుండా ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. నాసిరకం బగ్గు తీసుకోవడానికి కారణమైన వారిపైనా, ఉత్పత్తినికు దించిన వారిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్లాంట్‌కు ప్రభుత్వం సొంత గనులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌డిఎన్‌టిపిఎస్‌లో తమకు27 శాతం వాటా ఉన్నందున ఆ ప్లాంట్‌ను అప్పగిస్తే తామే నడుపుతామని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనిపై ఎపి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని సింగరేణి గనుల నుంచి నాణ్యమైన బొగ్గు తెచ్చుకోవడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏముందో అర్థం కావడం లేదన్నారు. పోర్టుకువంద కిలోమీటర్ల దూరంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు ఆదాయాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. పోర్టుకు దగ్గరగా ఉన్న ఈ ప్లాంట్‌కు ఎందుకు నష్టాలు వచ్చాయో బోర్డు పెద్దలకే తెలియాలన్నారు. నష్టాలకు కారణమైన డైరెక్టర్లు, ఉన్నతాధికారులను వదిలిపెట్టి సంస్థ మనుగడ కోసం రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతున్న ఇంజినీర్‌, జెఎసి నాయకుడు గుమ్మడి శ్రీనివాసులును బదిలీ పేరుతో ఇబ్బంది పెట్టాలని చూడడం సరికాదన్నారు. ఈ బదిలీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మితమైన ప్రజల ఆస్తిని అమ్మేస్తాం, లీజుకు ఇస్తాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్లాంట్‌ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటించేవరకు జెఎసి చేసే ప్రతి కార్యక్రమానికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు పారిశ్రామిక కారిడార్‌ కార్యదర్శి ఎం.మోహనరావు, సిఐటియు నాయకులు గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య, ఎస్‌డిఎన్‌టిపిఎస్‌లో జెఎసి నాయకులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.