- బడ్జెట్ నుంచే అనుమతించారా ?
- సిఎస్‌కు ఎజి కార్యాలయం ప్రశ్నావళి
- 26 అంశాలతో నమూనా
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సంస్థలు తీసుకునే రుణాలపై ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీల వివరాలపై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఆరా తీస్తోంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఎజి కార్యాలయం నుంచి లేఖ అందింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్యారెంటీ వివరాలను అందించాలని కోరింది. వార్షిక గణాంకాలను ఖరారు చేసేందుకేనని చెబుతున్నప్పటికీ, కేవలం గ్యారెంటీల వివరాలను మాత్రమే కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై 26 ప్రశ్నలతో నమూనాను కూడా జత చేయడం గమనార్హం. ఇండియన్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్స్ సంస్థ కూడా ఇవే అంశాలపై వివరాలు కోరుతున్న నేపథ్యరలో ఎజి కార్యాలయంలోని విఎల్‌సి (ఓచర్ లెవెల్ కంప్యూటరైజేషన్) విభాగం కూడా సిఎస్‌కు లేఖ రాయడం గమనార్హం. తన ప్రశ్నావళిలో గ్యారెంటీలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించింది. ఏ సంస్థకు ఎంత గ్యారెంటీ ఇచ్చారన్న దానితోపాటు ఆ రుణానికి సంస్థలు చేస్తున్న వాయిదాల చెల్లింపులు, గడువు తేదీల వివరాలు కూడా సమర్పించాలని కోరింది. ఈ గ్యారెంటీలకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు కూడా ఇవ్వాలని, ఏవైనా రుణాలను రీషెడ్యూల్ చేశారా అన్నది చెప్పాలని స్పష్టం చేశారు.
ఎందుకోసం ఈ రుణం?
అనేక సంస్థలకు భారీగా రుణాలకు గ్యారెంటీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ సంస్థలు ఆ రుణాలను ఏ అవసరానికి తీసుకున్నాయన్నది కూడా చెప్పాలని ఎజి కార్యాలయం కోరడం గమనార్హం. గ్యారెంటీల ద్వారా ఆయా సంస్థలు ఏయే బ్యాంకుల నంచి, ఏయే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్న వివరాలను కూడా ప్రశ్నావళిలో చేర్చారు. ఈ గ్యారెంటీల మొత్తం 2021 మార్చి నెలాఖరుకు, 2022 మార్చి నెలాఖరుకు ఎంత ఉన్నాయన్నది కూడా చెప్పాలని కోరింది.
వడ్డీలకూ గ్యారెంటీ ఇచ్చారా ?
ఆయా సంస్థలు తీసుకున్న రుణాలకేనా, ఆ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీలకు కూడా గ్యారెంటీ ఇచ్చారా అని ఎజి కార్యాలయం ఆరా తీస్తోంది. ఒప్పందం మేరకు రుణం తీసుకున్న నాటి నుంచి ఎంత అసలు చెల్లించారు, ఏమైనా గారెంటీల కాలపరిమితి ముగిసిందా అన్న వివరాలపైనా ప్రశ్నలు వేశారు. ఇక గ్యారెంటీలపై వసూలు చేయాల్సిన కమిషన్‌పైనా అడగడం గమనార్హం. వసూలు కాని గ్యారెంటీల కమిషన్‌కు ఉన్న కారణాలు చెప్పాలని కోరింది. వాటికి సంబంధించిన చలాన్ల వివరాలు కూడా పంపించాలని స్పష్టం చేసింది.
వార్షిక టర్నోవర్‌పైనా..
ప్రభుత్వ గ్యారెంటీల ద్వారా రుణాలు తీసుకున్న సంస్థల వార్షిక టర్నోవర్ల వివరాలు కూడా సమర్పించాలని ఎజి కోరింది. ప్రధానంగా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల వివరాలు కావాలని కోరింది. రుణాలకు సంబంధించి ఆయా సంస్థలకు చేసే బడ్జెట్ కేటాయింపుల్లో పొందుపరిచారా లేదా అన్నది కూడా చెప్పాలని పేర్కొంది.










