Jan 08,2023 18:46

2కె వాక్‌లో యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకువస్తానని మాట చెప్పి నేడు మడమ తిప్పడం అన్యాయమని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.హరిప్రసాద్‌, ఎస్‌.జాబీర్‌ తెలిపారు. సిపిఎస్‌ రద్దు చేయాలంటూ ఆదివారం సాయంత్రం స్థానిక మండల వనరుల కేంద్రం నుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం వరకు 2కె వాక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సిపిఎస్‌ రద్దు చేస్తామని ఎటువంటి హామీ ఇవ్వని రాజస్థాన్‌, పంజాబ్‌, చత్తీస్‌ఘడ్‌, అస్సాం, తమిళనాడు తదితర రాష్ట్రాలలో సిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయుటకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఓవైపు నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు. మన ప్రభుత్వం అధికంలోకి వస్తే వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చి సిపిఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులచే ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిపిఎస్‌ కంటే జిపిఎస్‌ మెరుగైందని చెప్పడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. సిపిఎస్‌ అమల్లోకి వచ్చే ముందు, అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యుటిఎఫ్‌ స్వతంత్రంగా జీపు జాతాలు, పాదయాత్రలు, ముట్టడి కార్యక్రమాలు లాంటి ఉద్యమాలు చేస్తూ మరోపక్క రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఒక బలమైన ఐక్య ఉద్యమాన్ని నిర్మించిన తర్వాతనే ముఖ్యమంత్రి తన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా సిపిఎస్‌ను రద్దు చేస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందేనన్నారు. మూడున్నర ఏళ్లు గడిచినా ఈ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేయకపోగా జిపిఎస్‌ అనే పేరుతో మరో దుర్మార్గమైన పథకాన్ని తీసుకురావడం చాలా అన్యాయమని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చ్సేఏందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ రమణమూర్తి, జిల్లా కార్యదర్శి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు చెంగల్‌ రాజు, రాజంపేట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణయ్య, నాగేంద్ర, సీనియర్‌ నాయకులు ఎం.నాగేశ్వర్‌ గౌడ్‌, పెనగలూరు మండల ప్రధాన కార్యదర్శి నరసింహారావు, పుల్లంపేట మండల అధ్యక్షుడు సాంబ శివరావు, నందలూరు మండల కోశాధికారి సుధాకర్‌, చిట్వేలు, ఓబులవారిపల్లి మండలాలకు చెందిన యుటిఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.