రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఘర్షణ నెలకొన్న సంకేతాలు దేశంలో తరచుగా చోటు చేసుకుంటూనే వుంటాయి. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా నివారించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులపైనే వున్నట్లు కనిపిస్తూ వుంటుంది. ఇటీవలి కాలంలో, అనేక అంశాలపై ఘర్షణాయుత వైఖరిని అనుసరించకుండా, వేధింపులకు పాల్పడే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో శాంతియుతంగా ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యవహరించిన తీరే ఇందుకు సాక్ష్యంగా వుంది. ఇటీవలి కాలంలో రాజకీయంగా క్రియాశీలంగా వున్న వారినే గవర్నర్లుగా నియమించడం, పైగా వారు కేంద్రం ఏజెంట్లుగా పక్షపాత వైఖరితో వ్యవహరించడమే ఈ పరిణామాలకు కారణంగా భావించాల్సి వుంటుంది. అయితే, తమకున్న అధికారాలను వారు అర్ధం చేసుకునే ధోరణిలోనే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి. తమ రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో ''ఎయిడ్ అండ్ అడ్వైజ్'' నిబంధనతో గవర్నర్లను పరిమితం చేయడంతో, కొంతమంది గవర్నర్లు, ప్రభుత్వాలను నిరంతరంగా ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళనలో వుంచేందుకు గానూ, తమకు ఇచ్చిన విచక్షణాయుతమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ లాంఛనంగా తాము ఉపయోగించాల్సిన రాజ్యాంగ అధికారాలను, కొద్ది అసాధారణ పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో తమ మంత్రుల సలహాలు, సూచనలకు అనుగుణంగానే వ్యవహరించాలని 1974లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఆ పరిస్థితులేంటనేవి కూడా వివరంగా జాబితా ఇచ్చింది. అయినా, క్షమాభిక్ష పెట్టడం లేదా బిల్లులకు ఆమోద ముద్ర ఇవ్వడం వంటి అభ్యర్ధనలపై కొంతమంది గవర్నర్లు సరిగా వ్యవహరించని అసాధారణ పరిస్థితులు తలెత్తుతున్నాయి. తమిళనాడుకు సంబంధించి ఒక అంశాన్ని పరిశీలించినట్లైతే, కేంద్ర చట్టంతో విభేదిస్తున్న కారణంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరమైన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడానికి విముఖతను ప్రదర్శించారు.
రాజ్యాంగం కారణంగానే చాలా ఘర్షణలు తలెత్తుతుంటాయి. గవర్నర్లు వ్యవహరించడానికి నిర్దిష్టంగా కాలపరిమితిని రాజ్యాంగం విధించలేదు. ఏదైనా సలహా ఇచ్చారా, ఒకవేళ ఇస్తే ఏ సలహా ఇచ్చారనే విషయంలో విచారణ జరపకుండా న్యాయస్థానాలను నిషేధించడంతో తమ విచక్షణా పరిధిలో ఏముంది, ఏమి లేదు అని ఎంపిక చేసుకునే అసాధారణ అధికారాన్ని 163వ అధికరణ ఇస్తోంది. ఈ పథకంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే, దీన్ని పునస్సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన వ్యక్తులుగా గవర్నర్లకు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత వుంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రోత్సహించే లేదా హెచ్చరించే బాధ్యత కూడా వుంది. మంత్రివర్గం ఇచ్చిన సలహాలను గవర్నర్లు వినాల్సిన అవసరం లేదనే భావన కూడా కొన్ని సార్లు నెలకొంటుంది. ప్రాంతీయ రాజకీయ శక్తులు కేంద్రానికి తమ వాదన వినిపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో గవర్నర్ పాత్రకు సంబంధించిన నిబంధనలు కూడా సవరించాల్సిన సమయం ఆసన్నమైంది. విచక్షణ చూపించాల్సిన రంగాలను గుర్తించడం, చర్యలు తీసుకోవడానికి వారికి నిర్దిష్టంగా కాలపరిమితిని విధించడం, బిల్లుల విషయంలో కేబినెట్ సలహాతో ముందుకు సాగాల్సి వుంటుందని వారికి స్పష్టం చేయడం వంటి అంశాలను పరిశీలించాల్సి వుంది. బిల్లులకు సంబంధించి, అందులో ఎలాంటి విచక్షణ లేదని భావిస్తేనే పున:పరిశీలనకు బిల్లులను గవర్నర్లు వెనక్కి పంపాలనే నిబంధనను రాజ్యాంగ నిర్ణయాక అసెంబ్లీ ఆమోదించిందన్నది సుస్పష్టం. దీనికి తోడు, ఎం.ఎం.పంచ్ఛి కమిషన్ సూచించినట్లుగా, విశ్వవిద్యాలయాల్లో చాన్సలర్ల కార్యాలయంతో గవర్నర్లపై పనిభారాన్ని మోపే పద్దతికి స్వస్తి చెప్పడాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం వుంది.
- ది హిందూ సంపాదకీయం










