Dec 02,2022 21:32

గుత్తిలో నూతన బైబాస్‌ రైల్వే ట్రాక్‌

           అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో కీలకమైన గుత్తి రైల్వే జంక్షన్‌లో కొత్తగా ఏర్పాటైన బైపాస్‌ లైన్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించారు. దీని ద్వారా గుత్తిలో ఇప్పటి వరకు రైళ్ల రివర్స్‌ సమస్యకు పరిష్కారం లభించినట్టయింది. ఇంజన్‌ మార్పు సమయం ఆదా అవడం ద్వారా రాకపోకల్లో కొంత సమయం ఆదా అయ్యే వీలు కలుగుతుంది. 3.2 కిలోమీటర్ల మేర రూపొందించిన బైపాస్‌ లైన్‌ రూ.43 కోట్ల విలువతో చేపట్టారు. ఈ రైల్వేలైన్‌ నిర్మాణంతో గుత్తి -ధర్మవరం, గుత్తి-రేణిగుంట లైన్ల మధ్య రాకపోకలు ఇక సులభతరం కానున్నాయి. ఈ జంక్షన్‌ నుంచి బెంగళూరు, రేణిగుంట, డోన్‌, గుంతకల్లు, వాడి వైపు ప్రయాణికుల రైళ్లతోపాటు సరుకు రవాణా రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. దక్షిణం వైపు ధర్మవరం, రేణిగుంట వైపు వెళ్లే రైళ్లు ఖిచ్ఛితంగా ఆపి రివర్సల్‌ చేసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఇందుకు చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఈ బైపాస్‌ నిర్మాణం వల్ల సమయంఆదా అవనుంది. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థతో గుత్తి దక్షిణం వద్ద క్యాబిన్‌, గుత్తి జంక్షన్‌ వద్ద మరో క్యాబిన్‌ ఉన్నాయి. నూతనంగా నిర్మించిన బైపాస్‌ లైన్‌ జంక్షన్‌ క్యాబిన్‌ దగ్గర మొదలవుతుంది. గుత్తి జంక్షన్‌ క్యాబిన్‌ ఇప్పుడు గుత్తి జంక్షన్‌ బైపాస్‌ క్యాబిన్‌గా వ్యవహరించబడుతుంది. దీనికి అనుగుణంగా క్యాబిన్‌ను రూపొందించి ఇప్పటికే ఉన్న మార్గ్‌ను అనుసంధానం చేశారు. బైపాస్‌ లైన్‌ గుత్తి పట్టణ పక్కనే ఉన్నందున రైలు ప్రయాణికుల రాకపోకలకూ సులభతరం చేయడానికి హైలెవల్‌ హాల్ట్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు.
కొత్త బైపాస్‌లైన్‌ ప్రారంభంతో ప్రయోజనాలు
ధర్మవరం వైపు నుంచి రేణిగుంట వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా రాకపోకలు సాగించవచ్చు.
సరుకు రవాణా వెళ్లే రైళ్లు నేరుగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ప్రయాణికులతో వెళ్లే రైళ్లకు ఆటంకాలుండవు. సెక్షన్‌ సామార్థ్యాన్ని పెంచేందుకు వీలు పడుతుంది.
రైళ్లు సగటు వేగం పెంచేందుకూ ఉపయోగపడుతుంది.
రవాణా వ్యవస్థ వృద్ధితో పాటు రోలింగ్‌ స్టాక్‌(కోచ్‌లు, వ్యాగన్‌)ల వినియోగాన్ని మెరుగు పరుస్తుంది.
సకాలంలో పూర్తి చేసిన సిబ్బందికి జిఎం అభినందన
        ముఖ్యమైన బైపాస్‌ లైన్‌కు అవసరమైన మార్పులతో సకాలంలో పూర్తి చేసిన సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందినట్టు దక్షిణ మధ్య రైల్వే పిఆర్‌ఒ రాకేశ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బైపాస్‌ నిర్మాణం పూర్తి చేయడం వలన కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్న థర్మల్‌ పవర్‌ప్లాంట్‌, కృష్ణపట్నం ఓడరేవు, సిమెంటు పరిశ్రమలకు సరుకు రవాణాను సులభతరం చేయనున్నట్టు జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడంలో కృషిచేసిన ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌ను అభినందించారు.