Sep 05,2020 08:04
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు

* నేడు ఉపాధ్యాయుల దినోత్సవ్యం * 
కరోనా సంక్షోభ సమయంలో...ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం...పాఠశాలల్లో కళాశాలల్లో జరుపుకునే పరిస్థితి లేదు. ఉపాధ్యాయ అవార్డు ఉత్సవాలను కూడా రద్దు చేశారు. కానీ గొప్ప ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తి కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈలోగా ''ఆల్‌లైన్‌ తరగతులు'' ప్రారంభించారు. ఇప్పటికి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల పట్ల ఆసక్తి చూపించటం లేదు. టెక్నాలజీ, ఆన్‌లైన్‌ క్లాసులు ఉపాధ్యాయుడికి, తరగతి గదికి ప్రత్యామ్నాయం కాదని మరోసారి వెల్లడైంది. విద్య యొక్క లక్ష్యం కేవలం జ్ఞానం అందించటమే కాదు. విద్యార్థి ''మూర్తిమత్వాన్ని'' (పర్సనాలిటీ) తీర్చిదిద్దటం, విద్యార్థిలో సామాజికీకరణ పెంపొందించటం, విద్యార్థుల భవిష్యత్‌ని తీర్చిదిద్దటం, ప్రశ్నించేతత్వాన్ని పెంచటం మొదలైనవి. వీటిని తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలడు.
విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్ల అధ్యాపకుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేవు. ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల శ్రద్ధ చూపటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంగాని, ప్రస్తుత ప్రభుత్వంగాని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
'ప్రైవేటు' ఉపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యలో 70 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో 38 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 32 లక్షల మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల ప్రైవేటు పాఠశాలల్లో 1,20,000 ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలో సుమారు 1,30,000 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ మార్చి నెలలో ప్రకటించిన తరువాత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు వేతనాలు లేవు. ఫీజులు వసూలు కాలేదనే నెపంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు వీరికి జీతాలు చెల్లించటం లేదు. వందలాది మంది ఉపాధ్యాయులు జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. కొంతమంది కూరగాయలు, పండ్లు అమ్ముతున్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందించాలని, ఆదుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు అందించటం, పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావుకి విజ్ఞప్తి చేయటం జరిగింది. ప్రభుత్వం ఇంత వరకు ప్రైవేటు ఉపాధ్యాయుల గురించి నిర్ణయం చేయలేదు. ఈ వారంలో పాఠశాల విద్య కమిషనర్‌ ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌.జె.డి.లకు, డి.యి.ఓ లకు ఉత్తర్వులు పంపారు. ఇవి అమలు జరగవు. ప్రభుత్వమే ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందించాలి.
గురుకులాల ఉపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్‌లో అనేక రకాల గురుకులాలు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. వీటిలో కస్తూరిబా విద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జ్యోతిరావ్‌ పూలే బి.సి. గురుకుల పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలలు ముఖ్యమైనవి. రాష్ట్రంలో 352 కస్తూరిబా విద్యాలయాలు ఆడపిల్లలకు రెసిడెన్షియల్‌ విద్య అందిస్తున్నాయి. వీటిలో పని చేసే ఉపాధ్యాయులందరూ కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులే. ఒకరు కూడా పర్మినెంట్‌ ఉపాధ్యాయులు లేరు. గిరిజన గురుకులాలలో 1400 మంది ఉపాధ్యాయులు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరికి గత 6 నెలలుగా జీతాలు లేవు. సాంఘిక సంక్షేమ, బి.సి గురుకుల పాఠశాలల్లో సుమారు 3 వేల మంది పార్ట్‌-టైం, గెస్ట్‌ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కూడా గత 6 నెలలుగా వేతనాలు లేవు. గురుకులాలన్నింటి సమస్యలను అధ్యయనం చేసి వారిని, ముఖ్యంగా కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులను పర్మినెంట్‌ చేయాలి. మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించి 010 సౌకర్యం కల్పించాలి.
'ప్రభుత్వ' ఉపాధ్యాయులు
రాష్ట్రంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ప్రభుత్వ మున్సిపల్‌ పాఠశాలలలో 1,80,000 ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్య గత రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉండి ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీ వ్యవస్థ బలహీనంగా ఉన్నది. ఉపాధ్యాయులు గత మూడేళ్లుగా బదిలీలు లేక బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. సిపియస్‌, పిఆర్‌సి వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పరిష్కరించలేదు.
యూనివర్శిటీలు, కళాశాలలు
రాష్ట్రంలో దాదాపు 20 ప్రభుత్వ యూనివర్శిటీలు ఉన్నాయి. వీటిలో ఎప్పటికప్పుడు అధ్యాపక పోస్టులు భర్తీ చేయకపోవటంతో దాదాపు 4 వేలకు పైగా ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 2 వేల మంది కాంట్రాక్టు, గెస్ట్‌ అధ్యాపకులుగా పని చేస్తున్నారు. వీరికి న్యాయం చేయవలసి ఉంది. ప్రభుత్వం జూనియర్‌ కళశాలల్లో దాదాపు 3,500 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులుగా 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. వీరిని క్రమబద్ధీకరించాలి. రాష్ట్రంలో 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 137 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు విద్యా రంగానికి ఎన్నో సేవలు అందించాయి. జివో నెం.35 ద్వారా ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో గత రెండు దశబ్దాలుగా పోస్టులు భర్తీ చేయక పోవడం వలన అవి క్షీణించిపోతున్నాయి. వీటిలో పని చేస్తున్న సుమారు 2 వేల మంది అన్‌ ఎయిడెడ్‌, పార్ట్‌-టైం అధ్యాపకులకు న్యాయం చేయవలసి ఉన్నది. వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాలలో ప్రైవేటీకరణ విధానాలు అవలంబించటమేకాక, ప్రోత్సహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు దశాబ్దాలుగా విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ప్రైవేట్‌ యూనివర్శిటీలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు కూడా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ''నూతన విద్యా విధానం'' (ఎన్‌ఇపి) కూడా ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా ఉన్నది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించుకోవటానికి పౌర సమాజం ఉద్యమించాల్సిన అవసరమున్నది. దానిలో భాగంగానే ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఉద్యమాలు చేయటం, ఉపాధ్యాయులను సంఘటిత పరచటం జరగాలి. ముఖ్యంగా ప్రైవేట్‌ ఉపాధ్యాయులు సంఘటితమైనప్పుడు హక్కులు సాధించుకోగలరు. విద్యా వ్యవస్థకు మూలస్తంభమైన ఉపాధ్యాయుల సంక్షేమాన్ని పట్టించుకోవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
                                                                              * కె.యస్‌. లక్ష్మణరావు (వ్యాసకర్త శాసన మండలి సభ్యులు. సెల్‌ : 9440262072)