Jan 24,2023 19:39

పాఠశాలలో విచారణ చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి -వాల్మీకిపురం: పట్టణంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమింపబడ్డ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. మదనపల్లి ఆర్‌డిఒ మురళి, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ పీడీ ధనలక్ష్మి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య మంగళవారం ఉదయం గురుకులంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బాలికలకు సౌకర్యాల కల్పన, భోజనం, వైద్యా సేవలపై ఆరాతీశారు. నాలుగు రోజుల క్రితం గురుకులంలో చోటుచేసుకున్న 9వ తరగతి బాలిక సంఘటన విషయమై నియమించిన కమిటీ గురుకులంలో సుధీర్ఘ విచారణ చేపట్టడం గమనార్హం. సుమారు ఆరు గంటలకు పైగా కమిటీ సభ్యులు రహస్య విచారణ చేపట్టారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులు, సిబ్బందిని విడివిడిగా విచారించారు. బాలిక సంఘటన, తదితర విషయాలపై చర్చించినట్లు తెలిసింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కూడా వైద్యులు, సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. విద్యార్థులపట్ల దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలని పాఠశాల యాజమాన్యాన్ని కూడా ఆదేశించారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గురుకులాల సంస్థ కార్యదర్శి పవన్‌ మూర్తి, సిడిపిఒ భారతి, తహశీల్దార్‌ ఫిరోజ్‌ఖాన్‌, ఎస్‌ఐ బిందు మాధవి, డాక్టర్‌ కీర్తి, ప్రిన్సిపల్‌ గుణశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.