రాష్ట్రానికి చెందిన బిజెపి రాజ్యసభ సభ్యుడు సి.ఎం. రమేష్ రాష్ట్ర ప్రభుత్వంపై శుక్రవారం మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యం నడుస్తోందని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని బహిరంగ బెదిరింపులకు దిగారు. ప్రధాని మోడీ టెలిస్కోప్‌లో చూస్తున్నారు, ఇక మీ ఆటలు సాగవు అని హెచ్చరించారు. ఐపిఎస్ అధికారులను రీకాల్ చేస్తాం జాగ్రత్తన్నారు. ఉన్నట్టుండి సి.ఎం. రమేష్‌కు ప్రజాస్వామ్య రక్షణపై ఎందుకు పూనకం పూనిందో తెలీదు. రాజ్యాంగం ప్రకారం అంతర్గత పోలీసింగ్ రాష్ట్రాల పరిధి లోని అంశం. అలాంటిది ఇక్కడ శాంతి భద్రతలపై కేంద్రం కల్పించుకుంటుందనడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కబ్జా. రాష్ట్ర పోలీస్ కేడర్‌కు బదలాయించిన ఐ.పి.ఎస్ లను కేంద్రం రీకాల్ చేయడం కుదరదు. ఇప్పటి వరకు జరగలేదు. ఎం.పి గా సి.ఎం. రమేష్‌కు ఈ కనీస పరిజ్ఞానం లేదనుకోలేం. రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొనే ఎత్తులో భాగమే ఈ తరహా ఘీంకారాలు. ఒక్క సి.ఎం రమేష్ తోనే ఈ రంకెలు ఆగలేదు. మరో ఎం.పి జివిఎల్ సైతం అదే బాట పట్టారు. రామ్ మాధవ్ వంటి వారైతే రాష్ట్రంలో అవినీతిపై పోరాటం చేస్తామంటున్నారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడులకు బిజెపి, ఆ పార్టీ ఏలుబడి లోని మోడీ ప్రభుత్వానిదే పేటెంట్. అలాంటి పార్టీ లోకి వ్యక్తిగత అవసరాల కోసం ఉన్నపళంగా ఫిరాయించిన సి.ఎం. రమేష్ వంటి వారికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? కడప జిల్లా వాసిగా ఉన్న ఆయన విభజన హామీ కడప స్టీల్‌ప్లాంట్‌పై ఎప్పుడైనా రాజ్యసభలో మాట్లాడారా? ఉన్న విశాఖ స్టీల్‌ను తమ ప్రభుత్వం ప్రైవేటీకరించి తీరతామని పార్లమెంట్‌లో ఒకటికి పది సార్లు శపథం చేస్తుంటే ఉలుకు పలుకు లేదు. సి.ఎం రమేష్‌తో పాటు బిజెపి లోకి ఫిరాయించిన సుజనా చౌదరి అయితే ప్రైవేటుపరం చేయాలంటున్నారు. రాష్ట్రానికి సంజీవనిగా పేర్కొనే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఒక వైపు చెబుతూ మరో వైపు కొత్తగా పాండిచ్చేరి, బీహార్‌కు హోదా ఇస్తామంటుంటే సి.ఎం రమేష్ గొంతెందుకు పెగలట్లేదు. ఉత్తరాఖండ్‌కు హోదా ఉన్నందున అక్కడ ప్రాజెక్టులు పెట్టి రాయితీలు పొందుతున్న సి.ఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు విభజన కష్టాల్లో నిండా మునిగిన ఎ.పి కి కేంద్రం హోదా ఇవ్వనని తెగేసి చెప్పినా ఎందుకు వారి నోళ్లు మూతబడుతున్నాయి? పోలవరానికి నిధులు, వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రకు నిధులపై కేంద్రం వద్ద ఎందుకు నిలదీయడం లేదు? ప్రజాస్వామ్యానికి దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలపై కేంద్రం నాలుక మడత పెడుతుంటే ప్రజాస్వామ్యం గురించి బిజెపి నేతలు మాట్లాడడం గురివింద సామెతను గుర్తుకు తెస్తుంది.
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి బిజెపి చేస్తున్న ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతు ఉద్యమంపై సాగించిన నిర్బంధంపై దేశంలోనే కాదు, అంతర్జాతీయ సమాజం సైతం అభిశంసించింది. లఖింపూర్ ఖేరీ మారణకాండ బిజెపి అకృత్యాలకు పరాకాష్ట. సుప్రీం కోర్టు వేసిన సిట్ దర్యాప్తులో పక్కా ప్రణాళిక తోనే రైతుల పైకి కారును పోనిచ్చి హత్య చేశారని తేలింది. అయినా అందుకు బాధ్యుడైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను మోడీ ప్రభుత్వం మంత్రిగా కొనసాగించడం ప్రజాస్వామ్యం అవుతుందా? పార్లమెంట్‌పై బిజెపి కి విలువ లేదు. గత సమావేశాలను జరగనీకుండా చేసింది ప్రభుత్వమే. సమావేశాలను అడ్డుకున్నారంటూ 12 మంది విపక్ష సభ్యులను రాజ్యసభలో సస్పెండ్ చేసింది. ఎన్నికల సవరణ చట్టం వంటి కీలక బిల్లులపై చర్చ లేకుండా, సెలెక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తొక్కేసి ఏకపక్షంగా ఆమోదింపజేసుకుంది. చెప్పుకుంటూ పోతే బిజెపి రాజ్యాంగ విఘాతాలు కోకొల్లలు. బిజెపి రాష్ట్రాల్లో రాజ్యాంగ విరుద్ధ పాలన ఎంత దారుణంగా యు.పి లో కరోనా రోగులపై పెట్టిన కేసులే ఉదాహరణ. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బిజెపి నేతల ఉవాచలు రాజకీయ పెత్తనం కోసం తప్ప చిత్తశుద్ధితో కాదు.










