Jan 18,2023 23:08

అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని నల్లమాడ మండలం వంకరకుంట లో ఒక రైతు పొలంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేపట్టిన ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ యశ్వంత్‌ తెలిపారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14న వంకర కుంటలో ఒక రైతు పొలంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారన్నారు. నల్లమాడ ఎస్‌ఐ కి వచ్చిన ఫిర్యాదు మేరకు నల్లమాడ సిఐ నిరంజన్‌ రెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో మూడు టీములుగా ఏర్పడి కేసు చేధించామన్నారు. ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్‌, నల్లమాడకు చెందిన శివశంకర్‌ రెడ్డి, నరేంద్ర రెడ్డి, శ్రీనివాసులు, విజరు, చాంద్‌బాషా, తమిళనాడుకు చెందిన మురుగన్‌, సురేష్‌, నల్లమాడకు చెందిన నాగమణిలను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి తవ్వకాలకు వాడిన పరికరాలను నిందితుల సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా కొంతమందిని అరెస్టు చేయాల్సుందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిజాముద్దీన్‌తో నాగమణి కలిసి తన భర్త ఎఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ను హత్య చేయడానికి కుట్ర చేసిందని ఈ విషయం కూడా తమ విచారణలో బయటపడిందని అన్నారు. ఈ కేసు తదుపరి దర్యాప్తునకు అనంతపురం పోలీసులకు బదిలీ చేసామన్నారు. తవ్వకాల కేసును చేధించిన సిఐ నిరంజన్‌ రెడ్డి, నల్లమాడ ఎస్‌ఐ వలిబాషా, ఒడిసి ఎస్‌ఐ గోపి కుమార్‌, బుక్కపట్నం, ఆమడగురు ఎస్‌ఐలు నరసింహులు, వెంకటరమణను ఎస్పీ ఈసందర్భంగా అభినందించారు.