గుంతలను పూడ్చాలని సిపిఎం నిరసన
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్ మండలం ములుమూడి కలుజు మధ్యలో పడిన గుంటను వెంటనే పూడ్చాలని కోరుతూ ఆదివారం సిపిఎం రూరల్ మండల కమిటీ నాయకులు కలుజు వద్ద నిరసన ధర్నా చేశారు. ధర్నాలో పాల్గొన్న సిపిఎం నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి ఆలూరు తిరుపాలు మాట్లాడుతూ గత 6నెలల నుంచి ములుమూడి కలుజు మధ్యలో పడిన గుంత వల్ల నెల్లూరు - తాటిపర్తి రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అయితే నెల్లూరు రూరల్, సంగం మండలంలోని అనేకమంది ప్రజాప్రతినిధులు ఈ మార్గంగుండా వెళుతుంటారని అయినా ఎవరూ పట్టించుకోవడంలేదని దానితో సిపిఎం నెల్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో తాత్కాలికంగా రబ్బిష్ వేసి గుంతను పూడ్చామన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన గుంతను పూడ్చి ప్రమాదాల నివారించాలని తెలిపారు. అలాగే ములుమూడి కలుజుపై హైలెవెల్ వంతెన నిర్మించి ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పూడిపర్తి జనార్ధన్, అట్ల అనిల్, గుంటి నాగరాజు, ఎస్.కె అమీర్ భాషా, ముత్యాల ఆదయ్య, మానీకల చెంచురామయ్య, కే సుబ్రహ్మణ్యం, ఎస్.కె చాన్‌బాషా, ఏ.అంజయ్య రాపూరు.రమేష్, పి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.










