Sep 02,2023 23:28

  • ఎంపి సమక్షంలోనే బాహాబాహీ

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి, గుడివాడ
కృష్ణాజిల్లా గుడివాడ వైసిపిలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాలశౌరి సమక్షంలోనే వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, ఆ పార్టీకి చెందిన వడ్లాని సుధాకర్‌ బాహాబాహీకి దిగారు. గుడివాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద నూతన పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపి బాలశౌరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే మండలి హనుమంతరావుతో ఎంపి అనుచరుడు వడ్లాని సుధాకర్‌ ఘర్షణకు దిగారు. ఎంపి ఇద్దరినీ వారించే ప్రయత్నం చేసినా నాయకులు వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న మండలి అనుచరులు భారీ సంఖ్యలో మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో సుధాకర్‌ అక్కడ నుంచి పరారయ్యారు. మండలి అనుచరులు ఆగ్రహంతో సుధాకర్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. గుడివాడ నెహ్రూ చౌక్‌ సెంటర్లో హల్‌చల్‌ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చేయిదాటిపోకుండా హనుమంతరావుకు సర్ది చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు సుధాకర్‌ కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సినీనటుడు, మాజీ ఎంపి కైకాల సత్యనారాయణ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో ఎవరికి వారు తమకు ప్రాధాన్యత ఇవ్వలేదనే పేరుతో ఇద్దరు నేతలు ఘర్షణకు దిగినట్లు తెలిసింది.