Jul 10,2022 22:57

ప్రజాశక్తి - భవానీపురం
గట్టు వెనుక ప్రాంతంలోని 43, 45 డివిజన్లలో అవుట్‌ఫాల్‌ డ్రెయిన్లు నిర్మించకపోవటంతో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. దీంతో వర్షాకాలం కావటంతో కచ్ఛా డ్రెయిన్లు మురుగునీటితో నిండిపోయి రోడ్డుపైకి పారుతున్నాయి. ఎటుచూసినా డ్రెయిన్లలో ముల్లోతున్న నీరు పారుదల లేక రోడ్లపై నిలిచిపోవటంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గట్టువెనుక వాసులను ఎన్నాళ్ళనుంచో వెంటాడుతున్న సమస్యకు ముగింపు దొరకడం లేదు. దీంతో దోమలు వ్యాప్తి అధికంగా ఉంటోంది. నగరపాలక సంస్థ అధికారులు డ్రైన్ల నిర్మాణంపై దృష్టి సారించకపోవటంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పేరుకు మహానగరం, అభివృద్ధి ఆమడ దూరం...
రాజధాని నగరంగా పేరుగాంచిన విజయవాడ అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో కనబడుతోంది. ఈ నేపధ్యంలో ఒకపక్క అస్తవ్యస్థమైన డ్రయినేజీ, మరోపక్క గుంతల మయంగా వున్న రోడ్లుపై ప్రయాణం చేయాల్సి రావటంతో పలువురు వహనదారులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్లు, డ్రెన్లు నిర్మించేందుకు కాంట్రాక్టులు పిలిచినా ముందుకు రాని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే 43వ డివిజన్‌ ఊర్మిళానగర్‌ ప్రధాన రహదారిలో సైడు కాలువలు నిర్మాణం చేయకపోవటంతో రోడ్డుపైకి మురుగు నీటితో పాటు వర్షం నీరు కూడా చేరిపోతోంది. దీంతో ఇటీవల స్థానిక కార్పొరేటర్‌ ఆ ప్రాంతంలో కచ్ఛా డ్రెయిన్‌ తవ్వించారు. ఊర్మిళాగర్‌ రోడ్డు, డ్రెయిన్‌ నిర్మాణానికి సుమారు రూ. 2 కోట్లు నిర్మాణానికి అంచనాలను తయారు చేసినట్లు సమాచారం. అయితే వీటి నిర్మాణానికి కాంట్రాక్టర్‌ ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో ఒక పక్క ఛిద్రమైన రోడ్డు, మరోపక్క డ్రెయిన్లు లేక ఇళ్ళల్లో వాటిని మురుగునీరు రోడ్డుపైకి చేరిపోవటంతోపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఊర్మిళానగర్‌లో డ్రెయిన్లు నిర్మించిన లేదని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఊర్మిళానగర్‌ రోడ్డు నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావటం లేదని స్థానికులు లబోదిబోమంటున్నారు. రోడ్లు నిర్మాణం, అవుట్‌ఫాల్‌ డ్రైయినేజీ వ్యవస్థ చక్కదిద్దకపోతే ఎలాగని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రామరాజ్యనగర్‌లో కూడా డ్రెయిన్‌ నిర్మాణం లేక కచ్చా డ్రెయిన్‌లో నీరు నిలిచిపోయి చెరువుల్లా తయారైంది. ఇక కబేళా నుంచి నిర్మించిన అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ ఆ రోడ్డు చివరి వరకూ నిర్మించలేదు, అదే రోడ్డులో వివాహాది కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎం.కె ఫంక్షన్‌ హాల్‌, ఏజిఎం కళ్యాణ మండపాలు ఉన్నాయి. అక్కడ డ్రెయిన్లు నిర్మించకపోవటంతో మురుగు వచ్చి అక్కడ నిలిచిపోవటంతో భరించలేని దుర్వాసనకు తోడు దోమల బాధతో ఇబ్బందులు పడుతున్నామని వేలాది రూపాయలు డబ్బులు కట్టి వివాహాది కార్యక్రమాలు నిర్వహించుకునేవారు వాపోతున్నారు. కబేళా నుంచి చివరి వరకూ డ్రెయిన్‌ నిర్మించాలని కళ్యాణ మండపం నిర్వాహకులు నగరపాలక సంస్థ అధికారులను, స్థానిక కార్పొరేటర్‌ను కోరుతున్నారు.