ప్రజాశక్తి-రామగిరి గత టిడిపి హయాంలో పండుగలు వస్తే కానుకలు ఇచ్చేవారమని, అదే వైసిపి ప్రభుత్వం వచ్చాక పండుగలకు సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారని మాజీమంత్రి పరిటాల సునీత విమర్శించారు. బుధవారం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెన్షనర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 62లక్షల మందికిపైగా భూమి ఎక్కువ ఉందని, 3 వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడుతున్నారని నోటీసులు ఇచ్చారన్నారు. వారందరికీ పింఛన్లు తొలగిస్తారా.. అని ప్రశ్నించారు. అలాగే పింఛన్లు అందుకున్న కొందరు లబ్ధిదారుల పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ట్యాక్స్‌లు కడుతుంటే వారికి కోతలు విధిస్తున్నారని.. అలాగే ఉపాధి కోసం లగేజీ వాహనాలు, కార్లు తెచ్చుకుంటే వాటిని కూడా కారణంగా చూపి పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 2.10 లక్షల మంది పెన్షన్‌దారులకు నోటీసులు ఇచ్చి వివరణ అడిగారన్నారు. అయితే వాస్తవంగా బాధితుల సంఖ్య అంతకు నాలుగింతలు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే 2,500 మందికిపైగా పెన్షన్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెన్షన్ వస్తున్న ఏ ఒక్క పెన్షన్‌దారుకి అన్యాయం చేసినా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. సిఎం జగన్ తన జన్మదినం పూర్తి చేసుకున్న మరుసటి రోజే పింఛన్లలో కోత విధిస్తూ పేదలతో కన్నీరు పెట్టించడం బాధాకరమన్నారు. జిల్లాలో ఉన్న కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భూములు, వాహనాల విషయంలో టిడిపి హయాంలో చంద్రబాబు చాలా సడలింపులు ఇచ్చారన్నారు. ఇప్పుడు కూడా జిల్లాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అలాంటి సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా పింఛన్లు, రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత










