ప్రజాశక్తి - లేపాక్షి : జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లపట్టాలను రద్దు చేయాలని కలెక్టర్ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలం పరిధిలోని బిసలమనేపల్లి పంచాయతీ పరిధిలోని రాజీవనగర్ కాలనీ వద్ద గల జగనన్న కాలనీలో పర్యటించారు. ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులు తమ గృహాలను వేగంగా నిర్మించుకునేలా రుణాలిప్పించాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇందుకోసం అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి స్థాయి వరకు లక్ష్యసాధన దిశగా .ప్రణాళిక ఉండాలన్నారు. బిసలమనేపల్లి లేఅవుట్‌లో వారం రోజుల్లోపు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులనుకలెక్టర్ అధికారులు ఆదేశించారు. పునాది దశలో ఉన్న గృహాలు రూఫ్ దశకు, రూఫ్ దశలో ఉన్నవి స్లాబ్ దశకు, స్లాబ్ దశలో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని వారి ఇళ్లపట్టాలను రద్దు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, తహశీల్దార్ కాటంబాబు, ఎంపిడిఒ నరసింహ నాయుడు, హౌసింగ్ ఎఇ వాసంతి, ట్రాన్స్‌కో ఎఇ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : జగనన్న లే అవుట్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ సమీపంలోని జగనన్న లే అవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా లబ్దిదారులు లే అవుట్ లో నెలకొన్న మురుగుకాలువ సమస్యపై కలెక్టర్‌కి విన్నవించారు. గురుకుల పాఠశాల నుండి వచ్చే మురుగునీరు నేరుగా కాలనీలో చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అనేక సార్లు అధికారులకి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటేనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కనీస వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్,తహశీల్దార్ నాగరాజు,హౌసింగ్ ఏఈ రాజేంద్ర ఇంజనీరింగ్ అసిస్టెంట్ గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. ఈ మేరకు ఆయన పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, హౌసింగ్ పీడీ చంద్ర మౌలి రెడ్డి కలిసి హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కోటిపి లేఅవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలోని పక్కా గృహాల నిర్మాణాల్లో పురోగతి సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, తహశీల్దార్ హసీనా సుల్తానా ఇతర అధికారులు పాల్గొన్నారు.










