- సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు దోనేపూడి కాశీనాథ్
ప్రజాశక్తి-విజయవాడ: జగనన్న కాలనీ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడంతో పాటు టిడ్కో గృహాలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కృష్ణలంక 22వ డివిజన్‌లోని సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం ఖర్చును ప్రభుత్వమే భరించాలని, టిడ్కో గృహాలను వెంటనే మంజూరు చేయాలని, చెత్త పన్ను రద్దుచేయాలని, స్వర్గపురి రోడ్డులో డ్రైనేజి సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. సిపిఎం తూర్పు సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు బత్తుల చిన్నారావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శివర్గసభ్యులు దోనేపూడి కాశీనాధ్ మాట్లాడుతూ వైసిపి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులయిన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గృహాలను నిర్మించి ఇవ్వాలని, లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను చూపించాలని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న టిడ్కో గృహాలను వెంటనే లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 11న ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని 'స్పందన'లో లబ్దిదారులు అర్జీలు అందజేయాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 22వ డివిజన్‌లోని అర్హులయిన వారందరికీ కోర్టు కేసుల్లో నడుస్తున్న రాజధాని అమరావతి ప్రాంతంలోని స్థలాలను కేటాయించి, ఆ స్థలాలు ఎక్కడున్నాయో కూడా కనీసంగా లబ్దిదారులకు చూపించలేదన్నారు. కోర్టు కేసులో ఉన్న భూములను సైతం ఇళ్ల స్థలాలకు కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పడం అంటే భూ యజమానులకు, ప్రజల మధ్య ఘర్షణలు పెంచడమేనన్నారు. గత టిడిపి ప్రభుత్వం కాలంలో నిర్మించిన టిడ్కో గృహాలకు అర్హులయిన లబ్దిదారుల నుంచి రూ.53 కోట్లు కట్టించుకొని నాలుగు సంవత్సరాలు దాటిపోయినా నేటికీ ఏ ఒక్క గృహాన్ని కేటాయించలేదని, కనీసంగా చెల్లించిన డబ్బులకు కూడా అతీగతీలేదని అన్నారు. చట్టవిరుద్దమైన చెత్త పన్నును సచివాలయ సిబ్బంది బలవంతంగా ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తున్నారని, ఈ చెత్త పన్నును ఏ ఒక్కరూ కూడా చెల్లించవద్దని పిలుపునిచ్చారు. అనంతరం సచివాలయ అడ్మిన్ ఎస్‌కె ఆలికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి కృష్ణ, నాయకులు కాయల లక్ష్మణ, వాజా శ్రీనివాసరావు, టి తాండవకృష్ణ, కె.కుమారి తదితరులు పాల్గొన్నారు.










