ప్రజాశక్తి-కలెక్టరేట్: జగనన్న కాలనీలో పక్కా గృహాల నిర్మాణం వారంలో పురోగతి కనిపించకపోతే సంబంధిత అధికారులకు క్రమశిక్షణా చర్యలు తప్పవని కష్ణాజిల్లా కలెక్టరు పి.రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జగనన్న కాలనీల అభివృద్ధి, పక్కా గహాలు నిర్మాణాల పురోగతి, మన బడి నాడు-నేడు పనులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వివిధ నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను చైతన్యపరచాలని కలెక్టరు ఆదేశించారు. ఇందుకోసం సచివాలయాల వారిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వాలంటీర్లకు లక్ష్యాలు నిర్దేశించాలన్నారు. అధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడంతో పురోగతి లేదన్నారు. కేవలం కాగితాలపై ప్రగతి చూపడం మాని క్షేత్రస్థాయిలో వృద్ధి కన్పించేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జగనన్న లేఅవుట్ల అభివద్ధికి 52 పనులు పంచాయతీరాజ్ శాఖకు కేటాయించినప్పటికి ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. ఇంకా ప్రారంభించని ఇళ్లు, పునాది స్థాయి కంటే కింద ఉన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారం లోపు గణనీయమైన పురోగతి సాధించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది ముఖ్యంగా ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎం, క్షేత్ర స్థాయి సిబ్బంది అంటు వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ వాక్సిన్ వేయించాలని దానితో పాటు చిన్నారులకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని, పారిశుధ్యం బాగా లేని ప్రాంతాల వివరాలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్ ఎస్‌ఇ వీరాస్వామి, డ్వామా పీడీ జి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










