Sep 08,2022 22:37

ప్రజాశక్తి-విజయవాడ: జిల్లాలో జరుగుతున్న గహ నిర్మాణాల పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు, గహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. గహ నిర్మాణాల పనులు వేగంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని, రెవిన్యూ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు వాలంటీర్లతో సమన్వయం చేసుకొని నిర్మాణ పనుల్లో పురోగతిని చూపాలన్నారు. ప్రారంభంకాని ఇళ్లను ప్రారంభించేలా లబ్దిదారులను చైతన్యవంతులను చేయాలన్నారు. కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని గహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీదేవిని కలెక్టర్‌ ఆదేశించారు.
13 గ్రామాల్లో రీసర్వే పూర్తి
జిల్లాలో సమగ్ర భూ రీసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వీటిలో 13 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్‌ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం పనుల్లో భూ రికార్డుల స్వచ్ఛీకరణ సమగ్ర భూముల రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురువారం జిల్లా కలెక్టర్‌లు, జాయింట్‌ కలెక్టర్‌లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 8 మండలాల్లోని 108 గ్రామాల్లో భూ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో చివరి విడత అయిన 13 వ నోటిఫికేషన్‌తో 13 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు, జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఆఫీసర్‌ కె.సూర్యారావు పాల్గొన్నారు.
ప్రభుత్వ భవన నిర్మాణాలపై ప్రత్యేక దష్టి
గడువులోపు ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులను వేగవంతం చేశామని, ప్రారంభించాల్సిన భవనాలకు వారంలోపు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయితీరాజ్‌ గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధరకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు వివరించారు. ప్రభుత్వ భవన నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 268 గ్రామ సచివాలయాలు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 148, 260 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు 76, 239 వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు 51 భవనాలు పూర్తయ్యాయన్నారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్‌ ఇఇ అక్కినేని వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ వెంకటరమణ , జిల్లా పంచాయితీ అధికారి జె.సునీత పాల్గొన్నారు.