ప్రజాశక్తి బుక్కపట్నం : జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ అరుణ్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని బుచ్చయ్య గారి పల్లి వద్ద ఉన్న జగనన్న హౌసింగ్ లేఅవుట్‌లో జరుగుతున్న ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు చేపట్టకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించి వెంటనే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక కేజీబీవీ వద్ద 72 మందికి గృహాలు మంజూరు కాగా, 16 మంది మాత్రమే ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయని గుర్తించారు. బేస్ మెట్టు, బిలో బేస్ మెంట్ స్థాయిలో ఉన్న వాటిని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వారం లోపు పనులు ప్రారంభించాలని లేనిపక్షంలో వాటిని రద్దుచేసి అర్హులైన మరొకరికి గృహాల కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ఎందుకు ముందుకు రావడం లేదో తెలుసుకోవాలని చెప్పారు. ఇల్లు నిర్మించుకునే వారికి స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. జగనన్న కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలను సత్వరమే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, హౌసింగ్ పీడీ చంద్రమౌళి, హౌసింగ్ ఇన్‌ఛార్జి డిఇ షామీర్‌బాషా, తహశీల్దార్ నటరాజ్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్‌ఐ నరసింహుడు, సర్పంచి రూప, ఎఇ గౌస్ తదితరులు పాల్గొన్నారు.










