ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జగనన్నకు చెబుదాం, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని గ్రీవెన్స్ గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు 204 అర్జీలను స్వీకరించారు. అనంతరం డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న వాటిని మానిటర్ చేస్తూ సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్, గృహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, పిఆర్ ఎస్‌ఇ గోపాల్ రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, డిఇఒ మీనాక్షి, పట్టు పరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి రామకృష్ణ, డ్వామా పీడీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










