Feb 02,2023 21:17

పుట్టపర్తి మున్సిపల్‌ కార్యాలయం

         ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌   పుట్టపర్తి నగర పంచాయతీ గ్రేడ్‌-2 మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్‌ గురువారం విజయవాడలో జీవో 32ను విడుదల చేశారు. ఈ జీవోలో పుట్టపర్తి నగర పంచాయతీలో సంవత్సర ఆదాయం 4.47 కోట్లు వస్తోందని, వివిధ రాష్ట్రాల, విదేశాల నుంచి ఏట దాదాపు ఆరు లక్షల మంది సత్యసాయి మహా సమాధిని దర్శిస్తున్నట్లు వివరించారు. నగర పంచాయతీ కమిషనర్‌, కౌన్సిల్‌ సభ్యులు గతేడాది నవంబర్‌లో చేసిన తీర్మానాన్ని పరిశీలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందన్నారు. జనాభా కూడా 40 వేలకు చేరుకుందని తెలిపారు. సత్యసాయి జిల్లాగా ఏర్పడినందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో విడుదల చేశామన్నారు. దీంతో మున్సిపాలిటీకి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందని పుట్టపర్తిలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మున్సిపాలిటీ గ్రేట్‌-2గా మార్చడానికి స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని గురువారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో తగర పంచాయతీ ఛైర్మన్‌ ఓబుళపతి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.