ప్రజాశక్తి-పీలేరు: గర్భిణులు ఒత్తిడికి గురికావద్దని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య తెలిపారు. సోమవారం పట్టణంలోని జివి నగర్‌లో గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య బృందం 'గర్భిణులు- మానసిక ఒత్తిడి ప్రభావం' అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం, ఆక్సిజన్, పోషక పదార్థాలు బిడ్డకు తల్లి ద్వారానే అందుతాయనేది ఎంత నిజమో, తల్లిచేసే ప్రతి ఆలోచన బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. తల్లి పడే మానసిక ఒత్తిడి బిడ్డపై పడుతుందని, కావున గర్భిణికి కుటుంబ సభ్యులు మానసిక చేయూత నివ్వాలని కోరారు. శారీరక పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు నివారణా చర్యల్లో భాగంగా మందులు, మాత్రలు వాడుకోవడం ఎంత అవసరమో, స్వీయ మానసిక ప్రశాంతత అలవర్చుకోవడం అంతే ముఖ్యమమి పేర్కొన్నారు. ఉదయం పూట తేలికపాటి వ్యాయామం, మంచి వ్యాపకాలు, జ్ఞాపకాలు, బలాన్నిచ్చే పౌష్టికాహారం, పగటిపూట రెండు గంటల విశ్రాంతి, ఎనిమిది గంటల నిద్ర, మొదలగు మేలైన నిర్ణయాలతో మానసిక ఆరోగ్యం తల్లి స్వంతమని పేర్కొన్నారు. వడదెబ్బ నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియజేశారు. కార్యక్రమంలో పిహెచ్‌ఎన్ వెంకట సుబ్బమ్మ, పర్యవేక్షకులు కృష్ణయ్య, ఎఎన్‌ఎం లక్ష్మీదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు.










